తెలుగు ప్రజలు బాగుండాలని తాను కోరుకుంటున్నానని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్మమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ రాజకీయాల్లో బాగు చేసే క్రమంలో తప్పకుండా ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామన్నారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుంటే తెలంగాణ ప్రజలు తనను తప్పు పడతారన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టడం ఖాయమన్నారు. చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేసి ఉన్న పరువు కాస్తా పోగొట్టుకున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఏపీ నుంచి లక్ష మంది ఫోన్లు....
తనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష మంది ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పారన్నారు. తనను అక్కడి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు అందరి చంకల్లో దూరే అలవాటన్నారు. నరేంద్ర మోదీతో నాలుగేళ్లు కాపురం చేసిన చంద్రబాబు తర్వాత తేడాలొచ్చి ఇప్పుడు ఫ్రంట్ అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీని అతిగా పొగిడింది చంద్రబాబే అన్నారు. తెలంగాణ చంద్రబాబు జాగీరు కాదన్నారు. చంద్రబాబు కు పైత్యం ఎక్కువ అని సెటైర్ వేశారు.