తనకు పూజలంటే ఇష్టమని, తన అభిప్రాయాలు తనవని కేసీఆర్ అన్నారు. విశాఖలో శారదా పీఠంలో రాజ శ్యామల విగ్రహం ఉన్నందునే అక్కడకు వెళ్లానన్నారు. తాను రాజశ్యామల యాగం చేసిన తర్వాత గెలుస్తావని శారదా పీఠం స్వామీజీ చెప్పారని, అందుకే ఆయనను కలుసుకునేందుకు వెళ్లారన్నారు. తనను కలిసేందుకు ఎక్కువ సంఖ్యలో అక్కడకు జనం వచ్చారన్నారు. అయితే చంద్రబాబు బాకా మీడియా నాకు స్వాగతం చెప్పింది వైసీపీ వాళ్లని, ఇంకొక బాకా వెలమలు వచ్చారని తప్పుడు ప్రచారం చేశాయన్నారు. చంద్రబాబును ఓడించేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చంద్రబాబు దారుణాతి దారుణంగా ఓటమి పాలవుతున్నారన్నారు. అక్కడి ప్రజలు తనకు ఈ విషయం చెప్పారన్నారు. తాను సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లతో మాట్లాడనని, తనకంటూ ఒక లైన్ ఉందన్నారు. చంద్రబాబునాయుడు లీడర్ కారని, మేనేజర్ అని అన్నారు. మోదీకి ఎంత భజన చేశాడో నీతి అయోగ్ సమావేశంలోనే స్పష్టమైందన్నారు.