గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావు సంచలనాలకు మారుపేరు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఎవరికీ అర్థంకానిది. అసెంబ్లీ రద్దవుతుందని నెల నుంచి ప్రచారం జరుగుతుంది. ముందస్తు ఎన్నికలకు వెళతారని అందరూ ఊహించినిదే. కాని అసెంబ్లీ రద్దయిన గంటలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం మాత్రం నిజంగా సాహసమే. గతంలో ఎన్నడూ ఎవరూ ఇలా ప్రకటించలేదు. సిట్టింగ్ లు అందరికీ దాదాపు టిక్కెట్లు వచ్చినట్లే. కేసీఆర్ ఈ జాబితా కోసం గత కొన్ని నెలలుగా కసరత్తులు చేస్తున్నారు. పదిహేను సార్లు సర్వేలు నిర్వహించినట్లు కేసీఆర్ స్వయంగా చెప్పారు. సర్వే నివేదికల ప్రకారం తాను టిక్కెట్లు ఖరారు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
తొమ్మిది నెలల అధికారాన్ని....
గతంలో ఎన్టీరామారావు కూడా సంచలన నిర్ణయాలకు కేంద్రబిందువుగా ఉండేవారు. ఎన్టీరామారావు కూడా ఎప్పుడు ఎవరిని రాజీనామా చేయమంటారో తెలియని పరస్థితి. ఒకేసారి ఎంపీలందరి చేత రాజీనామా చేయించారు. అయితే ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపైన కూడా పార్టీలో భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. కేసీఆర్ తొందరపడ్డారని గులాబీ పార్టీలో కొందరు నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారు. మరో తొమ్మిదినెలలు అధికారం ఉన్నా, దాన్ని వదులుకుని వెళ్లడం మూర్ఖత్వమే అవుతుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యేలంతా మాజీలయినట్లే.
ఇప్పుడిప్పుడే పథకాలు.....
ఇప్పుడిప్పుడే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజల్లోకి వెళుతున్నాయని, రైతు పెట్టుబడి పథకం కూడా ఇప్పుడిప్పుడే గ్రామస్థాయిలో ప్రచారం ఊపందుకుంది. అలాగే రైతు బీమా పథకం కూడా ఇంకా గ్రామాలకు వెళ్లలేదు. మిషన్ భగీరధ పథకం కింద గ్రామాలకు నీళ్లు చేరలేదు. మిషన్ కాకతీయ పరిస్థితి కూడా అంతే. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లారంటే తమ అధినేత పెద్ద సాహసం చేసినట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు టిక్కెట్ల పంపిణీ కూడా పార్టీకి తలనొప్పిగా మారనుందంటున్నారు.
ఆశావహుల దారి ఎటు?
అనేక నియోజకవర్గాల్లో ఆశావహులు ఉన్నారు. ఇటీవల కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో ఆశావహులు తమ శక్తివంచన లేకుండా జనసమీకరణ చేశారు. అయితే వారి ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇప్పుడు వారు ఇతర పార్టీలవైపు ఖచ్చితంగా చూస్తారంటున్నారు. అభ్యర్థులు కొత్త వారైతే ముందుగా ప్రకటించినా వారు జనంలోకి వెళ్లి ఎన్నికల సమయానికి పరిచయం అవుతారు. అయితే అందరూ పాత అభ్యర్థులే కావడం వారిలో ఎక్కువ మందిపై వ్యతిరేకత ఉండటం గులాబీ పార్టీకి లాభదాయం కాదన్న వాదన కూడా పార్టీలో విన్పిస్తోంది. మొత్తంమీద కేసీఆర్ చేసిన సాహసం ఎటువంటి ఫలితాలనిస్తుందో వేచిచూడాలి.