గులాబీ పార్టీకి ఆయన శత్రువుగా మారారే ...!!

Update: 2018-11-05 17:30 GMT

ఎన్నికల పండగలో తప్ప సమస్యల పరిష్కారానికి ఎన్నడూ ప్రజలకు కనిపించని నేతలకు ఈ దఫా చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని అధికార పక్షంలోని అభ్యర్థులు ప్రచారంలో చేదు అనుభవాలే ఎదురౌతున్నాయి. నియోజక వర్గానికి ముఖం చూపకుండా వున్న తాజా మాజీ ఎమ్యెల్యేలకు జనం నుంచి ఛీత్కారాలు సత్కారాలుగా లభిస్తున్నాయి. దాంతో వారు బతుకుజీవుడా అని పోలీసుల రక్షణ తో బయటపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ తరహా అనుభవాలను అధికార పార్టీ అభ్యర్థులు చవిచూస్తూ ఉండటంతో కిమ్ కర్తవ్యమని ఆ పార్టీ అధిష్టానం ఆలోచనలు చేస్తుంది.

అటాక్ లు ఇక్కడే ....

యాదాద్రి జిల్లాలో కిషోర్ కు అక్కడి వారు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతామంటూ జనం అటాక్ చేశారు. కరీం నగర్ జిల్లా లో రసమయి బాలకిషన్ కు ఇలాంటి షాక్ ను స్థానిక ప్రజలు ఇచ్చేశారు. ఇక ఖమ్మం జిల్లాలో మదన్ లాల్ కి ఇప్పటి వరకు ఏ నిధులు తేలేకపోయావంటూ ప్రజలు ఛీ కొట్టేశారు. ఆదిలాబాద్ లో రేఖా నాయక్ కి చేదు అనుభవమే ఎదురైంది. ప్రచారం కి రావద్దంటూ స్థానికులు అడ్డు తగిలడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎమ్మార్పీస్ ఉందని అనుమానం.....

సూర్యాపేట జిల్లాలోనూ అదే పరిస్థితి పలు నియోజక వర్గాల్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. ఈ నిరసనల వెనుక చాలా చోట్ల ఎమ్మార్పీస్ ఉండటంతో గులాబీ ప్రచారానికి మందా కృష్ణ వర్గం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఎమ్మార్పీస్ ఉద్యమానికి కేసీఆర్ బ్రేక్ లు వేయడంతో ఈ నిరసన సెగలు ఇప్పుడు కారు పార్టీకి తగులుతున్నట్లు చెబుతున్నారు. మరి దీన్ని ఏవిధంగా అధికారపార్టీ ఎదుర్కొంటుందో చూడాలి.

Similar News