‘‘వివిధ పోరాటాల ఫలితంగా, ఆరు దశాబ్దాల నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు అనేక రకాల వత్తిళ్లు ఉన్నప్పటకీ బాధ్యతాయుతమైన పద్ధతుల్లో ముందుకు సాగాలన్న ఆలోచనతో ఎటువంటి పొత్తులు లేకుండా స్వతంత్రంగానే గత ఎన్నికల్లో పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని దీవించారు. అనేక అయోమయాల మధ్య ప్రస్థానాన్ని ప్రారంభించాం. టీఆర్ఎస్ ప్రారంభించిన ప్రగతి, సంక్షేమాన్ని అనేక రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రశంసించారు. ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా బిజినెస్ రిఫార్మర్ అవార్డు ఇచ్చింది. గత నాలుగు సంవత్సరాలుగా 17.17 తెలంగాణ ఆర్థిక వృద్ధిరేటు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం మంచి ప్రగతితో ముందుకు సాగుతోంది. ప్రతిపక్షాలు చేస్తున్నవి పిచ్చి ఆరోపణలు. నీటిపారుదల ప్రాజెక్టులపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి అడ్డుకుంటున్నారు. కొత్త రాష్ట్రం అతి స్వల్ప కాలంలో ఇంత వృద్ధిరేటు సాధించడం అందరి కష్టఫలితమే. కేంద్ర ప్రభుత్వం దేశంలో నెంబరు వన్ గా ప్రకటిస్తుంటే...విపక్షాలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నాయి. యాభై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నీటిపారుదల వ్యవస్థ సర్వనాశనమయింది. అన్నింటినీ సరిదిద్దుకుని పోతాఉంటే అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.’’
రాజకీయ అసహనం....
‘‘రాష్ట్రంలో రాజకీయ అసహన వైఖరి కన్పిస్తోంది. రౌండ్ టేబుల్స్ వాళ్ల బొంద టేబుల్స్ అని పెడుతున్నారు. ఈ సన్నాసులంతా కాంగ్రెస్ లో ఉన్నవాళ్లే. ఒక్కటంటే ఒక్క ఆరోపణకు ఆధారాల్లేవు. ప్రతిపక్షాలది కాకిగోల. నిరంతరాయంగా విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే. 35 ఏళ్లుగా కరెంటు కోతలతో చచ్చాం. దాన్ని మేం సరిదిద్దాం. ఛత్తీస్ ఘడ్ తో చేసుకున్న ఒప్పందాలపైనా యాగీ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ విచ్చలవిడిగా మరింత ఆరోపణలు చేస్తున్నారు. ఆరునూరైనా సరే తెలంగాణ ప్రగతిచక్రం ఆగకూడదు. నాలుగైదు మాసాల సమయం మేం త్యాగం చేశాం. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు.’’
తేల్చుకుందామనే....
‘‘కాంగ్రెస్ పీడ వదిలిందని ప్రజలు సంతోష పడ్డారు. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేశాం. ఈనాడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మతకల్లోలాలు లేవు. గుడుంబా గోలలేదు. పేకాట పంచాయతీలేదు. రాష్ట్రం ఇంత మంచిగా ఉంటే ప్రతిపక్షాలు చేస్తున్న అల్లరిని ఏమనుకోవాలి. సంక్షేమం కోసమే నేను పాటుపడ్డా. సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఈ దుర్గార్గాన్ని అణిచివేయడానికి మేం ప్రయత్నించాం. సంపద పెరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతాయి. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పని 76 అంశాలను కూడా అమలు చేశాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిని తొలి కేబినెట్ లోనే 47 కీలక నిర్ణయాలు తీసుకున్నాం. నామీద ఆరోపణలు చేస్తున్న వారికి ఒకటే సమాధానం. ప్రజల్లోకి వెళదాం. తేల్చుకుందాం. ప్రజలే ఎవరు పాలకులనేది నిర్ణయిస్తారు.’’ అని కేసీఆర్ అన్నారు. రేపటి నుంచే ఎన్నికల కార్యాచరణలోకి దిగుతున్నామని చెప్పారు.
సర్వేల్లో వంద స్థానాలు.....
తమకు వచ్చిన సర్వేలలో అనేక అంశాల్లో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కు దరిదాపుల్లోకూడా లేవు. వంద నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తామన్నారు. ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రజాస్వామ్యయుతంగానే తాను అసెంబ్లీని రద్దు చేశానన్నారు. రాహుల్ గాంధీ పెద్ద పెద్ద బఫూన్ అని తీవ్రంగా ఆరోపించారు. ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరన్నారు. ఎంఐఎంతో తమ అవగాహన కొనసాగుతుందన్నారు. ప్రధానిమోదీతో మాట్లాడితే బీజపీతో దగ్గరయ్యానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తమది లౌకికభావాలు కలిగిన పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ గెలిచే 20 స్థానాల పేర్లు చెప్పాలని కేసీఆర్ సవాల్ విసిరారు. అయితే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ స్పష్టమైన కారణాలు చెప్పకపోవడం విశేషం.