తెలంగాణ రాష్ట్రసమితికి త్వరలోనే భారీ దెబ్బ తగలనుందా? టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఒక సభలో హింట్ ఇచ్చారు. త్వరలోనే టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు తమ పార్టీలోకి వస్తున్నారని, వారిని కాపాడుకోవాలని సవాల్ విసిరారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను నిజం చేస్తూ ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి.
ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ.....
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిలు ముగ్గురూ ఈ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్నది పొలిటకల్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గత కొంతకాలంగా టీఆర్ఎస్ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. తనకు ప్రాధాన్యత లభించడం లేదన్న ఆగ్రహంతో ఉన్నారు. అలాగే మరో ఎంపీ సీతారాం నాయక్ కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందా? రాదా? అన్న సంశయంతోనే పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికల వేళ కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసేందుకు ఈ ముగ్గురికీ కండువాలు కప్పేందుకు కాంగ్రెస్ రెడీ గా ఉంది. మరి ముహూర్తం ఎప్పుడో చూడాల్సి ఉంది.