కేఈ తగ్గడం లేదుగా.....!

Update: 2018-08-27 05:00 GMT

అధినేత ఆగ్రహించినా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష‌‌్ణమూర్తి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని ఆయన మరోసారి కుండ బద్దలు కొట్టేశారు. ఇటీవల కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంటుందన్న వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే అవసరమైతే పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు కూడా తాను సిద్ధమయని అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కేఈ కృష్ణమూర్తి కూడా కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే చారిత్రాత్మిక తప్పిదం చేసినవాళ్లమవుతామన్నారు.

ఆగ్రహం వ్యక్తం చేసినా.....

అయితే దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తుల విషయంలో స్పష్టత రాకముందే ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, అవతల పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం తగదని చంద్రబాబు హెచ్చరించారు. ఇద్దరు మంత్రులతో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని ఆయన అన్నారు కూడా. అయితే ఇటీవల కర్నూలులో జరిగిన ధర్మపోరాట దీక్ష సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తితో ఆయన ఈ విషయం గురించి ప్రస్తావించలేదు.

కొంచెం మార్చి.....

కాని కేఈ కృష్ణమూర్తి మరోసారి తన మనసులో మాటను చెప్పేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకుంటే ప్రజలు అంగీకరించరన్నారు. ఏపీలో మాత్రం కాంగ్రెస్ తో కలసి నడిచే ప్రసక్తి లేదని కేఈ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాబట్టి, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పాటు ఏ పార్టీతోనైనా పెట్టుకునేందుకు అవకాశాలున్నాయన్నారు. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఏపీలో మాత్రం కాంగ్రెస్ ను ప్రజలు ఇప్పట్లో ప్రజలు క్షమించరని ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Similar News