కన్నా చేరిక.. టీడీపీ నేతల్లో గుబులు.. రీజన్ అదేనా?
కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దీంతో టీడీపీలో కొందరు నేతలు ఆందోళనకు గురవుతున్నారు
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయన తనకు సుదీర్ఘకాలం విరోధిగా ఉన్న పార్టీ కండువాను కన్నా కప్పేసుకుంటున్నారు. దాదాపు పదేళ్ల పాటు చట్టసభల్లోకి అడుగుపెట్టలేకపోవడం కన్నాను నిద్రపోనివ్వడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరినా ప్రయోజనం లేదు. అందుకే 2024 ఎన్నికల్లోనైనా గెలిచి శాసనసభలో అడుగుపెట్టి పాలిటిక్స్ లో తన పవర్ తగ్గలేదని చెప్పాలనుకుంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ. అందుకే టీడీపీలో చేరడానికి డిసైడ్ అయిపోయారు.
ఆయన సీనియర్ నేతగా...
నిజానికి కన్నా లక్ష్మీనారాయణ ఆషామాషీ నేత కాదు. అయితే అది ఒకప్పుడు. ఈ పదేళ్లలో గుంటూరు జిల్లా రాజకీయాల్లో కొత్త తరం పుట్టుకొచ్చింది. కన్నా తన వెంట అనుచరులు ఉన్నారని అనుకుంటున్నా ఓటు బ్యాంకు ఏ మేరకు ఉంటుందన్నది చెప్పలేం. ఎందుకంటే జాతీయ పార్టీ అభ్యర్థిగా నరసరావుపేట ఎంపీ స్థానానికి పోటీ చేసినప్పుడే ఆయన తనకున్న అసలు బలం ఏంటో తెలిసిపోయింది. ఆ ఎన్నికల్లో తన కులం ఓట్లు కూడా తనకు పడలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరిపోవడానికి సిద్ధమయి పోయారు. ఏ రాజకీయ నాయకుడైనా తనకు ఓపిక ఉన్నంత వరకూ పాలిటిక్స్ లో క్రియాశీలకంగానే ఉండాలనుకుంటారు.
కాపు నేతగా...
అదీ జనసేన పార్టీ పెట్టడంతో కాపులకు ప్రాధాన్యం పెరిగింది. టీడీపీ అధికారంలోకి వస్తే కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబు మంచి పదవే ఇస్తారన్న టాక్ కూడా ఉంది. పార్టీలో కూడా నెంబర్ టూ గా ఎదిగే అవకాశాలు లేకపోలేదు. అయితే చినబాబు ఇన్‌ఫ్లూయెన్స్ తట్టుకుని కన్నా లక్ష్మీనారాయణ ఎంత మాత్రం నిలబడగలరన్నదే ఇప్పుడు ప్రశ్న. నాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీనియర్ నేతలు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు లాంటి వారే ఇబ్బందులు పడ్డారు. మరి కన్నా వారితో పోలిస్తే ఎంత అన్న అనుమానాలు ఆయన అనుచరుల నుంచి గుసగుసలుగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న నేతలు...
మరోవైపు కన్నా లక్ష్మీనారాయణకు కాపు కోటాలో మంత్రి పదవి లభిస్తే, తమ పరిస్థితి ఏంటని ప్రస్తుతం టీడీపీలో ఉన్న కాపు నేతలు గాబరాలోనే ఉన్నారు. ప్రధానంగా కాపుల్లో చిన రాజప్ప, బొండా ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా లాంటి నేతలు కన్నా వస్తే అంతంత మాత్రంగానే ఉన్న తాము వెనకబడి పోవడం ఖాయమని లోలోపల మధనపడుతున్నారు. అలాగని తమ మనసులో మాటను బయటకు చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. టీడీపీలో కాపు సామాజికవర్గం నేతల్లో కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య భూమిక పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇన్నాళ్లూ పార్టీ జెండాను మోసిన తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏంటన్నది మాత్రం అర్థం కాకుండానే ఉంది. ఇలా కన్నా లక్ష్మీనారాయణ చేరిక సొంత పార్టీలోని నేతల్లోనే గుబులు పుట్టిస్తుంది. మరి ఏం జరుగుతుందనేది కాలమే చెప్పాల్సి ఉంటుంది.