రగులుతున్న కాపులు....కీలక నిర్ణయం...?

Update: 2018-09-22 05:30 GMT

కాపు జేఏసీ రగిలిపోతోంది. తమను నమ్మించి నట్టేట ముంచారని ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ జాతికి జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 25, 26వ తేదీల్లో కాపు జేఏసీ సమావేశం కానుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసంలోనే ఈ సమావేశం జరుగనుంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం ఓట్ల కోసమే కాపు రిజర్వేషన్లపై నాటకమాడిందన్న అభిప్రాయంలో కాపు జేఏసీ ఉంది. కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకున్నారని, తాము ఇచ్చిన సూచనలను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పట్టించుకోలేదని కాపు జేఏసీ అభిప్రాయపడుతుంది.

చంద్రబాబుకు విన్నవించినా.....

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకమునుపు కాపు జేఏసీ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిని చేసింది. గతంలో కాపు రిజర్వేషన్లపై తీర్మానాన్ని అసెంబ్లీలోచేసి కేంద్రానికి ప్రభుత్వం పంపింది. కేంద్రం దీనిపై కొర్రీలు వేస్తుందని భావించిన కాపు జేఏసీ ఆ జీవోను వెనక్క తీసుకువచ్చి మార్పులు, చేర్పులు చేసి గవర్నర్ చేత ఆమోదింప చేసి రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని చంద్రబాబును కోరింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోపు ఈ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అలా జీవో అమలు చేస్తే చంద్రబాబు వెంటే కాపులు ఉంటారని, ఆయనకు జై కొడతామని కూడా తెలిపింది.

కీలక నిర్ణయం తీసుకుంటారా?

అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సున్నితమైన అంశం కావడంతో దాన్ని చంద్రబాబు పక్కనపెట్టినట్లే కన్పిస్తుంది. దీంతో కాపు జేఏసీ ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయింది. అందుకోసమే ముద్రగడ పద్మనాభం ఇంట్లో కాపు జేఏసీ సమావేశం కానుంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, కాపు రిజర్వేషన్ల అమలుపై ఎటువంటి పోరాటం చేయాలన్న దానిపై చర్చించనుంది. అలాగే కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ వైపే మొగ్గు చూపే అవకాశముంది. ఈ సమావేశంలోనే వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించాలన్న దానిపై కాపు జేఏసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Similar News