ముహూర్తం పెట్టేశారా....??

Update: 2018-12-28 03:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కసరత్తు పూర్తయిందంటున్నారు. ఢిల్లీలోనే ఆయన దీనిపై కసరత్తు చేశారు. మంచి ముహూర్తం కోసం ఆయన చూస్తున్నారు. పండితులతో సంప్రదిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఈరోజు చేరుకోనున్నారు. కేసీఆర్ వచ్చిన వెంటనే మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు పదిరోజులు దాటుతోంది. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రిగా ఒక్క మహమూద్ ఆలి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 11వ తేదీన ఫలితాలు వచ్చినా ఇంతవరకూ ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదు. మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు ఒకేరోజు లేదా రెండు మూడు రోజుల తేడాలో ఉండేలా చూడాలని ఇప్పటికే కేసీఆర్ గులాబీ నేతలకు ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు.

పది మందికే ఛాన్స్.....

అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్న టెన్షన్ గులాబీ పార్టీ నేతల్లో ఉంది. మంత్రి వర్గ విస్తరణలో కేసీఆర్ తో పాటు మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం తొలి విడత విస్తరణ ఉండనుందని చెబుతున్నారు. రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తొలి విడతలో కేవలం పది మందికే మంత్రివర్గంలో చోటు దక్కుతుందంటున్నారు. మలి విడత పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఉండే అవకాశముందని గులాబీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ముహూర్తాలు చూసుకుంటూ....

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జనవరి నాల్గో తేదీ వరకే మంచి ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత మళ్లీ పదిహేను రోజులు మంచి ముహూర్తాలు లేవు. దీంతో ఈలోపే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ నెల29, 30వ తేదీలు కూడా మంచి ముహూర్తం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఒడిశా, కోల్ కత్తా,ఢిల్లీ పర్యటనలను ముగించుకు వచ్చిన కేసీఆర్ మరో రెండు, మూడు రోజుల్లోనే ముహూర్తాన్ని ఫిక్స్ చేసే అవకాశముందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమచారం.

ఆశావహుల్లో టెన్షన్.....

కానీ తొలి విడతలో ఎవరుంటారన్న టెన్షన్ గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది. రెండోసారి అధికారంలోకి రావడంతో గత కేబినెట్ లో చోటు దక్కని నేతలు ఎక్కువ మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ లాంటి నేతలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో గులాబీ బాస్ పండితులతో సంప్రదింపులు జరుపుతుండటంతో త్వరలోనే విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అవుతుందని చెబుతున్నారు. ఈ నెల చివర గాని, జనవరి మొదటి వారంలో గాని మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశముంది.

Similar News