చంద్రబాబు అంటే ఐటి... ఐటి అంటే బాబు. ఇది పూర్తిగా జనం మరిచిపోయేలా చేస్తున్నారు కేసీఆర్. హైదరాబాద్ ఐటి అభివృద్ధిలో దూసుకుపోవడం లో బాబే కీ రోల్ అన్నది పసుపు పార్టీ మంత్రం. అయితే ఇది పూర్తిగా సత్యదూరమని తెలంగాణ బాస్ ప్రచారం గట్టిగా స్టార్ట్ చేశారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి టి చంద్రుడు తీసుకెళ్లారు. కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికల అనంతరం టి బాస్ మరింత విపులంగా ఐటి కింగ్ బాబు కానేకాదని చరిత్ర తవ్వి తీశారు. హైదరాబాద్ తానే నిర్మించానని చంద్రబాబు తన డబ్బా ప్రచారసాధనల సహకారంతో సాగించే ప్రచారం పై ఇప్పుడు చంద్రశేఖర రావు నీళ్లు పోసేస్తున్నారు.
అసలు చేసింది వారు ...
ఐటి హబ్ గా హైదరాబాద్ అవతరణకు దారితీసిన పరిస్థితులను బహిరంగపరిచారు కెసిఆర్. ఎన్నికల గోల పూర్తి కావడంతో ఐటి క్రెడిట్ కాంగ్రెస్ దే అన్న నిజం నేరుగా ఒప్పుకున్నారు. గతంలో హైదరాబాద్ కు వున్న భౌగోళిక ప్రత్యేక పరిస్థుతలను అధ్యయనం చేసిన ఐబీఎం నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ని కలిసి తమకు అక్కడ బ్యాక్ అప్ సెంటర్ల కోసం అనుమతి కోరారని వెల్లడించారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డిని ఢిల్లీ పిలిపించి హైదరాబాద్ కు మంచి అవకాశాలు లభిస్తున్నాయని అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.
నేదురుమిల్లి కృషితోనే......
ఆ వెంటనే నేదురుమల్లి కృషితో సైబర్ టవర్స్ నిర్మాణం జరిగినట్లు కెసిఆర్ చరిత్రను చాటి చెప్పారు. ఆ తరువాతా అంచెలంచెలు గా ఐటి హైదరాబాద్ లో అభివృద్ధి చెందిందే తప్ప బాబు పొడించింది ఏమి లేదని తేల్చేశారు కెసిఆర్. ఈ అంశాలన్నీ ఇప్పుడు తవ్వి పోయడంతో ఎపి సిఎం తరచూ చేసుకునే ప్రచారం ఆగుతుందా లేదా ఇంకా పెరుగుతుందా అన్నది వేచి చూడాలి.