వారం తిరక్కుండానే కేసీఆర్..!

Update: 2018-09-05 02:30 GMT

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనసడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ అడుగు ఇదే చెబుతోంది. నెల రోజులుగా ఆయన ముందస్తు ఎన్నికల కోసం అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వివిధ వర్గాల ప్రజలపై వరాలజల్లు కురిపిస్తున్నారు. భారీ ఎత్తున ప్రగతి నివేదన సభను నిర్వహించారు. డిసెంబర్ లో మూడు రాష్ట్రలతో కలిపి తెలంగాణకూ ఎన్నికలు జరగాలంటే కచ్చితంగా సెప్టెంబర్ 10 లోగా అసెంబ్లీని రద్దు చేయాలి. ఇందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషీ, ఉన్నతాధికారులు నర్సింగ్ రావు తదితరులు గవర్నర్ నరసింహన్ తో సమావేశమయ్యారు. ఇక రాష్ట్ర ఎన్నిక సంఘం సీఈఓ రజత్ కుమార్ సైతం గవర్నర్ ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో అసెంబ్లీ రద్దుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇష్టదైవాన్ని దర్శించి...

ఇక ప్రగతి నివేదన సభ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెట్టారు. స్వంత నియోజకవర్గంలోని తన ఫామ్ హౌజ్ లో ఆయన పార్టీ ముఖ్యులతో సమావేశమవుతున్నారు. ఉన్నతాధికారులను సైతం రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. 6వ తేదీన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అనంతరం 7వ తేదీన హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు సుమారు 65 వేల మంది జనసమీకరణ చేయాలని భావిస్తున్నారు. ఈ సభ బాధ్యతలను మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు అప్పగించారు. ఈ సభ ద్వారానే ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. అంతకుముందే సిద్ధిపేట జిల్లా కోనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ ఆలయం ఆయనకు చాలా సెంటిమెంట్. గత ఎన్నికల్లోనూ ఆయన నామినేషన్ వేసే ముందు ఆలయానికి వచ్చారు. ఇప్పడు ఈ ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారపర్వం ప్రారంభించనున్నారు.

50 రోజులు... 100 నియోజకవర్గాలు...

తెలంగాణలో 119 స్థానాల్లో 100 స్థానాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 7వ తేదీ హుస్నాబాద్ లో మొదటి సభ జరుగుతుంది. గత ఎన్నికల సమయంలోనూ ఆయన వంద నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ఇది మంచి ఫలితాలు ఇచ్చింది. దీంతో మళ్లీ ఇదే ఫార్ములాను కేసీఆర్ ప్రయోగిస్తున్నట్లు కనపడుతోంది. ఈ సభల కంటే ముందు ఎక్కువ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇంకా ఎన్నికలకు సిద్ధం కాకముందే ఆయన సుడిగాలి ప్రచార పర్యటనల వారికి అందనంత స్పీడ్ తో దూసుకుపోవాలనుకుంటున్నారు. 6వ తేదీన క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు ఉండనున్నాయి. ఇప్పటికే పెండింగ్ ఫైళ్లను క్యాబినెట్ ముందుంచాలని ఆయా శాఖాలకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. తర్వాత ఆయన అదే రోజు లేదా తెల్లారి అసెంబ్లీ రద్దు ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలపై కేసీఆర్ వ్యూహాలు ప్రతర్థులకు అంతుచిక్కడం లేదు.

Similar News