ఏపీలో బీఆర్ఎస్ పోటీ.. ఎవరికి నష్టం?

కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Update: 2022-10-06 07:15 GMT

కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కు త్వరలో ఇన్ ఛార్జిని కూడా నియమించనున్నారు. 2023లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత 2024లో జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలకు, ఏపీ ఎన్నికలకు మధ్య ఏడాది సమయం ఉంది. దీంతో ఏపీ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఎవరితోనైనా పొత్తుతో వెళతారా? స్వతంత్రంగా పోటీ చేస్తారా? అన్నది ఇంకా తెలియకపోయినా పోటీ చేయడం మాత్రం ఖాయమని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే ఎన్నికలలో...
బీఆర్ఎస్ ను దేశమంతా విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఒకే భాష ఉండి.. మొన్నటి వరకూ కలసి ఉన్న ఏపీలో పోటీ చేయడానికి ఆయన ఎందుకు వెనకాడతారు? ఖచ్చితంగా పోటీ చేస్తారంటున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కేసీఆర్ కు కొంత అభిమానులతో పాటు కొంత ఓటు బ్యాంకు ఉన్నట్లు గుర్తించారంటున్నారు. విభజనకు ముందు రాయల తెలంగాణ ప్రతిపాదన వచ్చిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.
హైదరాబాద్ తో అనుబంధం...
రాయల తెలంగాణ ప్రతిపాదన వచ్చింది కూడా ఇందుకోసమే. రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలోని నేతలతో పాటు ఎక్కువ మంది హైదరాబాద్ లోనే వ్యాపారంలో స్థిరపడ్డారు. ఉత్తరాంధ్ర నుంచి అనేక మంది వలసలు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సంబంధించిన సన్నిహితులు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు చోట్ల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా స్థిరపడ్డారు. అందుకోసమే ఏపీలో పోటీ చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ ఎవరితో కలసి పోటీ చేస్తుందన్న దానిపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో తమిళనాడులో పార్టీలతో కలసి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఇన్ ఛార్జి ఎవరంటే?
కానీ ఎంఐఎంతో కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్, ఎంఐఎం కలసి ఏపీలో పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీలు తమతో కలసి వచ్చే పార్టీలను కలుపుకుని పోటీకి దిగుతాయంటున్నారు. ఎన్నికల సమయంలో మూడు ప్రాంతాల్లో మూడు సభలు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వల్ల ఎవరికి నష్టం అనేది ఇప్పుడే చెప్పకున్నా అభ్యర్థుల ఎంపికను బట్టి చెప్పవచ్చంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఒక ఇన్ ఛార్జిని కేసీఆర్ నియమించాలని భావిస్తున్నారు. పలువురి నేతల పేర్లను ఆయన పరిశీలిస్తున్నారని తెలిసింది. కోస్తాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రిని బీఆర్ఎస్ ఇన్ ఛార్జిగా నియమిస్తారంటున్నారు.


Tags:    

Similar News