వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా సురేఖ - మురళిధర్ రావు దంపతులది ప్రత్యేక స్థానం. పార్టీ ఏదైనా ప్రజల్లో బలం కలిగి ఉండటంతో వారు విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలకు ముందు సమైక్యవాదిగా ముద్రపడినా వారిని టీఆర్ఎస్ లో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడానికి స్థానికంగా వారికి ఉన్న బలమే కారణం. 2014లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఘనవిజయం సాధించారు. తర్వాత ఆమె మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. కొండా మురళి మాత్రం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో గెలిచినా వరంగల్ ఈస్ట్ లో వర్గపోరు కొండాకు ఇబ్బందికరంగా మారింది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మేయర్ నన్నపునేని నరేందర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వంటి వారు కొండా దంపతులకు వ్యతిరేకంగా ఈస్ట్ నియోజకవర్గంలోనే ప్రత్యేక వర్గాలను ఏర్పరుచుకున్నారు.
కాంగ్రెస్ లో చేరడం ఖాయమనుకున్నా...?
ఈ ఎన్నికల్లో కొండా దంపతులు వరంగల్ ఈస్ట్ తో పాటు భూపాలపల్లి టిక్కెట్ ఆశించారు. అయితే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యేల జాబితాలో రెండు టిక్కెట్లు కాదు కదా కొండా సురేఖ పేరు కూడా లేదు. జిల్లాలో మొత్తం 12 స్థానాలకు 11 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినా కొండా సురేఖను మాత్రం పెండింగ్ లో పెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కొండా దంపతులు పార్టీపై అసమ్మతి బావుటా ఎగరేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ పార్టీలో పరిణామాలను, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. రెండు రోజుల్లో తమకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పాలని, లేకపోతే టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై బహిరంగ లేఖ రాస్తామని పేర్కొన్నారు. దీంతో వీరు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనపడింది. లేదా స్వతంత్రంగానైనా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావించారు.
బుజ్జగించాలనుకుంటున్న పార్టీ...
అయితే, కొండా దంపతులు చెప్పినట్లుగా ఎటువంటి బహిరంగ లేఖ విడుదల చేయలేదు. దీనికి కారణం కేసీఆర్ బుజ్జగింపు చర్యలే అని తెలుస్తోంది. కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ప్రభావం చూపే సామాజకవర్గంలో మంచి పట్టుంది. దీనికితోడు ఐదారు నియోజకవర్గాల్లో ఎంతోకొంత ప్రభావం చూపగలరు. పైగా ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న కొండా సురేఖ పార్టీకి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు ప్రజల్లోకి బాగానే వెళతాయి. ఇవన్నీ గమనించిన టీఆర్ఎస్ పెద్దలు వారు కారు దిగకుండా చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ప్రెస్ మీట్ తర్వాత కొండా అనుచరులు వారిని కలిసినా కొండా దంపతులు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వినాయక నవరాత్రుల సమయంలో కొండా దంపతులకు అచ్చిరాదనే నమ్ముతారు. దీంతో ఈ తొమ్మిది రోజులు వారు అందరికీ దూరంగా ఉంటారు. అందుకే 23న తమ నిర్ణయం తీసుకుంటామని కొండా మురళి ప్రకటించారు. అయితే, ఈ లోపే వారిని బుజ్జగించడానికి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు వీరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారని తెలుస్తోంది. అందుకే వారు బహిరంగ లేఖ విడుదలను వాయిదా వేసుకున్నారని సమాచారం. వారిని పిలిపించుకుని నచ్చజెప్పి టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. మరి, కొండా దంపతులు అధినేత మాట విని కారులోనే ఉంటారో దిగిపోతారో చూడాలంటే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.