అసెంబ్లీ రద్దు చేసే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ ఎన్నికలకు పూర్తిగా సన్నద్దమయ్యారు. అసెంబ్లీ రద్దు చేసిన గంటలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరతీశారు. టీఆర్ఎస్ పాలనపై, ప్రవేశపెట్టిన పథకాలపై, ముఖ్యంగా తనపై ప్రజల్లో సానుకూలత ఉందని గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు పెద్దగా కసరత్తు చేయలేదు. వివాదాస్పద ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వయస్సు పైబడిన వారికి కూడా టిక్కెట్లు ప్రకటించడం బట్టి చూస్తే అభ్యర్థుల కంటే కూడా పార్టీని, తనను చూసే ప్రజలు ఓట్లేస్తారనే అతివిశ్వాసం ముఖ్యమంత్రి కేసీఆర్ లో స్పష్టంగా కనపడుతోంది. అయితే, ఇంత విశ్వాసం టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.
వ్యతిరేకతను పట్టించుకోకుండా..!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమందిపై ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్ నాయక్ పై భూకబ్జాల ఆరోపణలు, అధికారులు, ప్రజలతో దురుసు ప్రవర్తనతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇక నల్గొండ జిల్లా నకిరేకల్, కరీంనగర్ జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్టా మధు వంటి వారిపై కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అయినా వీరందరికీ కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించారు. ఇక భూపాలపల్లిలో స్పీకర్ గా ఉన్న మధుసుదనాచారి, ములుగు ఎమ్మెల్యే చందూలాల్ కుమారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వారు వయస్సురిత్యా ప్రజల్లో చురుగ్గా తిరగలేక పోతున్నారు. అయినా, వీరికి టిక్కెట్లు దక్కాయి. ఇలా వివాదాస్పదంగా, తీవ్రంగా ప్రజావ్యతిరేకత ఎదుర్కుంటూ కూడా టిక్కెట్లు దక్కించుకున్న వారి సంఖ్య 20 వరకు ఉంది.
ఫిరాయింపుదారులకు టిక్కెట్లు..! మరి ఉద్యమకారులకు..?
సహజంగా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి చేరిన వారిపైనా నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో టీడీపీ తరుపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కాయి. వీరిలో జిల్లాల్లో గెలిచిన వారిని మినహాయిస్తే హైదరాబాద్ శివారు నియోజకవర్గాల నుంచి గెలిచిన వారు పార్టీ బలంతోనే గెలిచారు. ఇక కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ పార్టీల నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్న వారిని ఎవరినీ నొప్పించకుండా కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించారు. పార్టీ ఫిరాయించారనే చెడ్డపేరు వీరిలో సహజంగానే ఉంటుంది. పైగా ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇన్నేళ్లుగా టీఆర్ఎస్ జెండా మోస్తున్నవారు. నియోజకవర్గ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపించన ఉద్యమకారులు. వీరికి టిక్కెట్లు దక్కకపోవడంతో వారు అభ్యర్థులకు సహకరించే అవకాశం లేకపోగా, ఇతర పార్టీల వైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజల్లో కూడా వీరి పట్ల సానుభూతి వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
కేసీఆర్ ను చూసే ఓట్లేయాలా..?
వివాదాలను, ప్రజా వ్యతిరేకతను, ఆరోపణలను పట్టించుకోకుండా సిట్టింగ్ లు అందరికీ సీట్లిస్తామని చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల కంటే కూడా ఎక్కువగా కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు ఓట్లేశారు. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ పాలనను చూసి ఓట్లేసే ప్రజలు ఉన్నా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కూడా ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ కూడా చంకలు గుద్దుకుంటోంది. మొత్తానికి కేసీఆర్ అతి విశ్వాసం కొంప ముంచే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ నడుస్తోంది.