తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ఐదేళ్ల పూర్తి పదవీకాలం కాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే పూర్తి నమ్మకంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 60 ఏళ్ల సమైక్య పాలన తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపట్టారు. ఉద్యమనేత ముఖ్యమంత్రి కావడం వెనుక ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకం, ఆశలే ప్రధాన కారణం. సమైక్య పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్యం చేసి ఉద్యమబాట పట్టించిన కేసీఆర్ అధికారంలోకి వస్తే జరిగిన నష్టం నుంచి తేరుకుని రాష్ట్రం ప్రగతిపథం వైపు నడుస్తుందని అంతా భావించారు. ఇక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేతగా ఇచ్చిన భారీ హామీలు కూడా కేసీఆర్ గెలుపునకు కారణం. అయితే 50 నెలల పదవీకాలంలో ఆయన ప్రజలు పెట్టుకున్న ఆశలు, నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా..? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు..? అనేది ఒకసారి పరిశీలిద్దాం.
కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలు
- విద్యుత్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మొట్టమొదటి విజయం సాధించింది. తెలంగాణ వస్తే రాష్ట్ర అంధకారం అవుతుందని, విద్యుత్ దొరకదనే ప్రచారాన్ని పూర్తిగా తిప్పికొడుతూ రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ అందించడంలో సఫలీకృతమయ్యారు.
- తెలంగాణ ప్రాంతంలో చెరువులపై ఆధారపడి వ్యవసాయం చేయడమనేది కాకతీయుల కాలం నుంచే కొనసాగుతోంది. ఈ చెరువులను తిరిగి పునరుద్ధరించేందుకు ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వేల గ్రామాల్లో చెరువుల్లో పూడిక తీసి పునర్జీవం పోశారు.
- రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వని కొన్ని ముఖ్యమైన పథకాలను తీసుకువచ్చింది. ‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులకు ప్రతీయేటా వ్యవసాయానికి రూ.8 వేల పెట్టుబడి ఇస్తున్నారు. అయితే, సన్న, చిన్నకారు రైతులతో పాటు వందల ఎకరాలు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తింపచేయడం మాత్రం విమర్శలకు తావిచ్చింది.
- రైతులు ఏవైనా కారణాల వల్ల మరణిస్తే వారి కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు రైతుబీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఇది కూడా ఎన్నికల్లో ఇవ్వని హామీనే. ఈ పథకం ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి ప్రారంభమైంది.
- 70 ఏళ్లుగా ఉన్న భూసమస్యలను పరిష్కరించడానికి భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భూసమస్యలు పరిష్కరించి, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశారు. అయితే, హడావుడిగా చేయడం, క్షేత్రస్థాయిలో లోపాల వల్ల భూసమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు.
- ఎన్నికల సమయంలో ఐదేళ్లలో ఇంటింటికీ నీళ్లవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను అని కేసీఆర్ పదేపదే చెప్పారు. అన్నట్లుగానే ‘మిషన్ భగీరథ’ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పనులు జరిపించారు. ఇది చివరి దశకు వచ్చింది. త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.
- ప్రాజెక్టుల నిర్మాణంపై ఎన్నికల సమయంలో కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. అయితే, ఉత్తర తెలంగాణకు భారీ ఎత్తున విస్తీర్ణానికి సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పక్కన పెట్టారు.
- కులాలవారీగా వారి కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కురుమలకు గోర్లు, యాదవులకు బర్రెల, ముదిరాజ్, గంగపుత్రులకు చేపలు, కల్లు దుకాణాలను తిరిగి ప్రారంభించడం వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అయితే, వీటివల్ల గ్రామాల్లో కొంతమేర ప్రజలకు లబ్ధి జరిగినా విమర్శలే ఎక్కువగా వచ్చాయి.
- రైతులకు రుణమాఫీ హామీని నెరవేర్చుకున్నా, విడతలవారీగా చేయడంతో వడ్డీ భారం ఎక్కువవడంతో రైతులకు ఆశించినంత మేలు జరగలేదు.
- పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు కొత్త జిల్లాల ఏర్పాటు చేశారు. 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు. కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లను సైతం ఏర్పాటు చేశారు.
- స్థానికులకు న్యాయం జరిగేలా కొత్త జోనల్ విధానాన్ని తీసుకువచ్చారు.
నెరవేర్చని హామీలు...
- ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రధానంగా ఇచ్చిన హమీ ‘డబుల్ బెడ్రూం ఇళ్లు’. అయితే, గ్రామాల్లో నామమాత్రంగా కొన్ని ఇళ్లు కట్టిస్తున్నా, అవి ఏమాత్రం సరిపోవు.
- దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చినా అదీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొంతమందికి ఇచ్చే ప్రయత్నం చేసిన అది సఫలం కాలేదు.
- కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తామని సైతం కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు. అయితే, గురుకులాల ఏర్పాటు, నిర్వహణ బాగున్నా హామీ మాత్రం పూర్తిగా నెరవేరలేదు.
- కరీంనగర్, వరంగల్ నగరాలను డల్లాస్, లండన్ లా చేస్తామని హామీలు ఇచ్చినా ఆయా నగరాల అభివృద్ధికి పెద్దగా చెప్పుకోదగ్గ కృషి చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
- తెలంగాణ ఉద్యమ నినాదమైన ‘నీళ్లు - నిధులు - నియామకాలు’లో ఉద్యోగ నియామకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఖాళీల భర్తీ చేయలేకపోయారు. ఇచ్చిన నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణలోనూ విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
- తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమానికి వ్యతిరేకులుగా ముద్రపడ్డ పదుల సంఖ్యలో నాయకులను టీఆర్ఎస్ లో చేర్చుకుని పదవులు ఇవ్వడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.
- ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఆకాశ హార్మ్యాల నిర్మాణం వంటి అనేక హామీలు మాటలకే పరిమితమయ్యాయి.