కేరళ కన్నీటికి కారణం...?

Update: 2018-08-16 18:29 GMT

కేరళ కుంగిపోయింది. పచ్చటి కొబ్బరి చెట్లతో వారం రోజుల క్రితం వరకూ కళకళలాడే కేరళ రాష్ట్రం ఇప్పుడు ఎక్కడా చూసినా నీళ్లే. కేరళ వాసులకు కన్నీళ్లే. కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి వరద తాకిడికి దాదాపు 87 మంది ఇప్పటికే మృతి చెందారు. దీంతో కేరళలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. వేల సంఖ్యలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కేరళలో వరద పరిస్థితిని సమీక్షించారు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపించారు.

డ్యామ్ ల నిర్మాణాలే.......

ఇదిలా ఉండగా కేరళ ఇంత వరద ఉధృతిలో చిక్కుకోవడానికి స్వయం తప్పిదాలే కారణమన్నది నిపుణుల అంచనా. కేరళలో లెక్కుకు మిక్కిలిగా డ్యామ్ లను నిర్మించడం వల్లనే వరద తాకిడి ఎక్కువగా ఉందన్నది జలనిపుణుల అంచనా. కేరళ చిన్న రాష్ట్రమైనప్పటికీ సుమారు 39 డ్యామ్ లు ఉన్నాయి. నీటికి అడ్డుకట్ట వేయడం వల్లనే వరద తీవ్రత ఎక్కువగా ఉందన్నది జలనిపుణుల అభిప్రాయంగా తెలుస్తోంది. కేరళలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి విలయంలో చిక్కుకోవడానికి కారణం ప్రాజెక్టుల నిర్మాణమేనని నిపుణులు తేల్చారు.

రెడ్ అలెర్ట్.....

కేరళలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాన్ని కూడా నాలుగు రోజుల పాటు మూసివేశారు. విద్యాసంస్థలకు కేరళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అనేక రైళ్లను కూడా నిలుపుదల చేశారు. రిజర్వాయర్లు నిండుకోవడంతో గేట్లను ఎత్తడంతో వరద నీరు పల్లపు ప్రాంతాలకు చేరి వేలాది ఇళ్లు నీటి ముంపునకు గురయ్యాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. ముళ్లపెరియార్ డ్యామ్ వద్ద వరద నీటి ఉధృతి పెరగడంతో ఇడుక్కి జిల్లాలో అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. పెరియార్ నదీ తీర ప్రాంతంలో ఉన్నవారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అంతటా క‘‘న్నీళ్లే’’.......

కేరళలోని 14 జిల్లాలూ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ జిల్లాలన్నింటిలోనూ అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరద దెబ్బకు దాదాపు పదివేల కిలోమీటర్ల మేరకు రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. సుమారు రెండు లక్షల మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మొత్తం మీద కేరళలో జలవిలయానికి ప్రధాన కారణం ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులను నిర్మించడమేనన్న నిపుణుల అభిప్రాయాన్ని ఒకసారి మిగిలిన రాష్ట్రాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Similar News