కేరళలో అసలైన సేవ చేసింది ఇద్దరేనా...?

Update: 2018-08-21 02:30 GMT

దేశమే కాదు ప్రపంచం మొత్తం అక్కడ జరిగిన ప్రకృతి విలయానికి చెలించింది. అందమైన కేరళ భారీ వర్షాలు వరదల దెబ్బకు చిగురుటాకులా వణుకుతూ ఉంటే కన్నీరు పెట్టింది. అలాంటి ప్రళయంలో అద్భుతంగా పనిచేసిన వారు ఇద్దరే అని అంతా గుర్తించారు. వారే త్రివిధ దళాలు, జాతీయ విపత్తు నివారణ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సోషల్ మీడియా. ఈ రెండు చేసిన సేవలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలను త్రివిధ దళాలు కాపాడి వారికి ఆహరం, మంచినీరు నిత్యావసరాలు అందిస్తుంటే, ఎప్పటికప్పుడు జరిగిన దారుణాన్ని కళ్ళకు కట్టినట్లు ప్రపంచానికి క్షణాల్లో చేరవేసింది సోషల్ మీడియా. ఫలితంగా లక్షలాదిమంది ప్రాణాలు కాపాడగలగడమే కాదు, కోట్ల రూపాయలు విరాళాల రూపంలో ఇచ్చేందుకు, కేరళ వాసులను ఆదుకునేందుకు వదాన్యులు ముందుకు వచ్చేలా చేసింది.

అక్కడ హీరోలు వారే ...

సినిమాల్లో హీరో చేసే సాహసాలు చూస్తూ ఉంటాం. దీనికి తెరవెనుక డూప్ లు ప్రాణాలకు తెగించి చేసే పనులు కానీ గ్రాఫిక్ మాయాజాలం మనకు కనపడవు. హీరో మాత్రమే ఇదంతా చేశాడనేలా సినిమా ఉంటుంది. కానీ వాస్తవ జీవితంలో రియల్ హీరోలు ఎలా వుంటారో కేరళలో భారత సైనిక బృందాలు, నేవి, ఎయిర్ ఫోర్స్, జాతీయ విపత్తు నివారణ బృందాలు చేసిన సహస కృత్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా సాగాయి. హెలికాఫ్టర్ నుంచి కిందకు వెళ్ళి బాధితులను సురక్షిత ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ తరలించడం, అసాధ్యమనుకున్న ప్రాంతాలకు ప్రాణాలు ఫణంగా పెట్టి నేవి బృందాలు ధైర్యే సాహసే అన్నట్లు చేసిన ఫీట్లు, తాళ్ళపై పడుకుని సైన్యం తమ శరీరాలనే వంతెనగా మార్చి ప్రజలను తరలించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అంతే కాదు కేరళ వాసులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారత సైన్యం కి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేసే లా వారి సాహసాలు కొనసాగడం విశేషం.

Similar News