చంపేశారు...ఏం సాధించారు....?

Update: 2018-09-23 12:30 GMT

మావోయిస్టులు విరుచుకుపడి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ఎందుకు చంపేశారు? ఏం సాధించారు? ఇప్పుడు గిరిజిన గూడేల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోలు దారుణంగా హత్య చేయడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఉదాసీనంగా ఉండటం వల్లనే ఎమ్మెల్యేను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

పోలీస్ స్టేషన్లకు నిప్పు.....

అంతటితో ఆగని గిరిజనులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సర్వేశ్వరరావు అభిమానులు పోలీస్ స్టేషన్లకు నిప్పంటించారు. కానిస్టేబుళ్లపై దాడికి దిగారు. డుంబ్రిగూడ, అరకు పోలీస్ స్టేషన్లను తగులబెట్టారు. తమ ఎమ్మెల్యేను కాపాడలేకపోయారంటూ పోలీసులపై శాపనార్థాలు పెట్టారు. గిరిజనులు ఒక్కసారిగా దాడికి దిగడంతో పోలీసులు కూడా పరుగులు తీశారు. తమను తాము రక్షించుకునేందుకు కొందరు కానిస్టేబుళ్లు గిరిజనులను ప్రాధేయపడటం కన్పించింది.

అసలు ఎలా జరిగిందంటే.....

ఇదిలా ఉండగా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలు కలసి రెండు వాహనాల్లో గ్రామదర్శిని కార్యక్రమానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఉన్నట్లుండి దాదాపు ఇరవై మంది నక్సల్స్ వాహనాలను ఆపారు. వాహనాలను ఆపకుంటే బాంబులు వేస్తామని బెదిరించారు. దీంతో వాహనాలను ఆపాల్సిందిగా సర్వేశ్వరరావు తన డ్రైవర్ తో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను కిందికి దించి చేతులు వెనక్కు కట్టేశారు.

గన్ మెన్ల నుంచి.......

ఎమ్మెల్యే గన్ మెన్ల నుంచి తుపాకులను మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారందరినీ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో వాహనాల్లో ఉన్న దాదాపు పదిమంది ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను వారి వద్ద వదిలేసి దూరంగా వెళ్లి నుంచున్నారు. దాదాపు అరగంట తర్వాత నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన తర్వాత వారిద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ వదిలేసి పారిపోయారని చెప్పారు. కాగా ఎమ్మెల్యే హత్య ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లకు నిరసనగానే మావోలు ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Similar News