అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చడం ప్రతీకారమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. 2016లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో దాదాపు 33 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు రగిలిపోతున్నారు. సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులను తరిమేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే మావోయిస్టులు మాత్రం అదను కోసం వేచి చూస్తున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పై గత కొద్ది రోజులుగా మావోలు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనను హతమార్చడానికి రెక్కీ కూడా నిర్వహించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా గ్రామదర్శిని కార్యక్రమానికి సర్వేశ్వరరావు హాజరవుతున్నారని తెలిసి దీనికి పకడ్బందీగా హత్యకు ప్లాన్ చేశారు. మొత్తం మీద కిడారిని హత్య చేసి మావోలు ఏపీలో మరోమారు తమ ఉనికిని చాటుకున్నట్లయింది.