అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యలకు మావోయిస్టు అగ్రనేత చలపతి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. గత రెండు నెలల నుంచే కిడారిని హతమార్చేందుకు మావోయిస్టులు ప్లాన్ చేశారు. ఇందుకోసం పక్కాగా సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకుని శిక్షణ పకడ్బందీగా ఇచ్చారని పోలీసులు కనుగొన్నారు. చలపతి తన భార్య అరుణను ఈ ఆపరేషన్ కు కమాండర్ గా నియమించారు. కిడారి రాకపోకలపై నిఘాను కూడా ఉంచారు. కిడారి గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిసి దళ సభ్యులు యాభై మంది వరకూ రంగంలోకి దిగారు. చలపతికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా వాకీటాకీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
వాకీ టాకీ ద్వారా......
బెజ్జంకి అడవుల్లో వాకీటాకీ కనెక్టింగ్ పాయింట్ ను కూడా ఏర్పాటుచేసినట్లు పోలీసు విచారణలో వెల్లడయింది. గత నెల చివరి వారంలో చలపతి విశాఖ మన్యంలోనే మకాం వేసినట్లు తెలిసింది. ఆపరేషన్ కు ముందుగానే ఆయన సురక్షిత ప్రదేశానికి వెళ్లారని చెబుతున్నారు.కిడారి, సోమలను చంపిన వెంటనే వాకీ టాకీ ద్వారా ‘‘ఆపరేషన్ సక్సెస్’’ అంటూ చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే కిడారి రాకపోకలపై ఆ ప్రాంత వాసుల నుంచే మావోలకు ఉప్పందిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల సానుభూతి పరులను పోలీసులు విచారిస్తున్నారు.
ఎందుకు చంపామంటే....?
అలాగే మావోయిస్టులు కిడారి సర్వేశ్వరరావును, శివేరి సోమలను హత్య చేసిన తర్వాత ఆ గ్రామస్థులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారంటున్నారు. తాము వారిద్దరినీ ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరించారంటున్నారు. ముఖ్యంగా అక్రమంగా గనుల తవ్వకం, పార్టీ మారి ముప్ఫయికోట్లు తీసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న కిడారిని చంపడం కరెక్టా? కాదా? అని మావోయిస్టులు లివిటిపుట్టు గ్రామస్థులను ప్రశ్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వారి హత్యతో గిరిజనం నుంచి వ్యతిరేకత రాకూడదనే ఇలా తాము ఎందుకు చంపాల్సి వచ్చిందో గ్రామస్థులకు మావోలు వివరించారంటున్నారు. మొత్తం మీద చలపతి ఈ హత్య చేయించడంలో కీలక పాత్ర పోషించారని పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడయింది.
నేడు సీఎం పర్యటన.....
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు,శివేరి సోమ కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరికొద్దిసేపట్లో పరామర్శించనున్నారు. ఈ హత్యలు జరిగినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం అమెరికా నుంచి వచ్చిన చంద్రబాబు వెంటనే విశాఖకు బయలుదేరి వెళ్లారు. ఆ కుటుంబాల్లో బాబు భరోసా నింపనున్నారు. ఆ కుటుంబాలకు అండగా పార్టీ, ప్రభుత్వం నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.