కొండాతో జరిగే నష్టమెంత..?

Update: 2018-09-08 12:30 GMT

వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్ కు దూరమవడం ఖాయమైపోయింది. మొన్న 105 అభ్యర్థులతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొండా సురేఖ పేరు లేదు. వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినా కొండా ప్రాతినథ్యం వహిస్తున్న వరంగల్ ఈస్ట్ ను మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఈ స్థానాన్ని కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మేయర్ నన్నపునేని నరేందర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి వంటి వారు ఆశిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో పాటు కొండాకు వ్యతిరేకంగా మిగతా నేతలంతా గట్టిగా ప్రయత్నించి ఆమె పేరు ప్రకటించగా అడ్డుకొగలిగారనే ప్రచారం ఉంది. కారణాలేవైనా జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు సహా అందరికీ టిక్కెట్లు ఇచ్చి తనకు మాత్రం పెండింగ్ లో పెట్టడంపై కొండా సురేఖ మనస్తాపం చెందారు. అసలే ముక్కుసూటితనం, నిర్మోహమాటంగా మాట్లాడే ఆమె టీఆర్ఎస్ పార్టీపై, ఏకంగా కేటీఆర్ పైనే తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో 24 గంటల్లో చెప్పకపోతే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగ లేఖ రాసి పార్టీని వీడతానని స్పష్టం చేశారు. అయితే, కొండా సురేఖ టీఆర్ఎస్ ను వీడితే ఆ పార్టీకి ఎంత నష్టం కలుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

మున్నురుకాపు సామాజకవర్గంలో పట్టు...

టీఆర్ఎస్ ను వీడనున్న కొండా దంపతులు కచ్చితంగా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది. అయితే, కాంగ్రెస్ లో వారికి ఎన్ని టిక్కెట్లు ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే, టీఆర్ఎస్ పార్టీ ఎంతకాదని చెప్పిన కొండా వల్ల ఆ పార్టీకి కొంత నష్టం కలగడం, కాంగ్రెస్ కు అదనపు బలం చేకూరడం మాత్రం ఖాయంగా కనపడుతోంది. ముఖ్యంగా కొండా సురేఖకు జిల్లావ్యాప్తంగా క్యాడర్ ఉంది. జిల్లాలో భారీగా ప్రభావం చూపగలిగే మున్నురుకాపు సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. వారు ఆ సామాజికవర్గం కార్యక్రమాల్లో, సంఘాల్లో చురుగ్గా పాల్గొంటారు. 2004లో శాయంపేట నియోజకవర్గం నుంచి సురేఖ ప్రాతినిథ్యం వహించారు. తర్వాత పునర్విభజనలో శాయంపేటలోని రేగొండ, శాయంపేట మండలాలు భూపాలపల్లి నియోజకవర్గంలో కలిశాయి. దీంతో ఆ రెండు మండలాల్లో కొండా దంపతులకు గట్టి క్యాడర్ ఉంది. గత ఎన్నిల్లోనూ కొండా మురళి టీఆర్ఎస్ అభ్యర్థి మధుసుదనాచారిని గెలిపించడానికి ప్రచారం నిర్వహించారు. ఇక 2009లో ప్రాతినిధ్యం వహించిన పరకాల నియోజకవర్గంలోనూ ప్రజల్లో బలం ఉంది. గతంలో వీరితో పనిచేసిన ముఖ్యనేతలు ప్రస్తుత ఎమ్మెల్యే చల్లా దర్మారెడ్డి వైపు వెళ్లినా వారు మళ్లీ కొండా వైపు తిరిగే అవకాశం ఉంది.

ఈస్ట్ లో వ్యతిరేకతలు ఉన్నా...

తాజాగా కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడ కూడా ప్రజల్లో, క్యాడర్ లో మంచి పట్టు సంపాదించుకున్నారు. మున్నురు కాపు సామాజకవర్గం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే, ఈ ఐదేళ్ల కాలంలో కొండా మురళీ వరంగల్ ఈస్ట్ లో ఎక్కువగా వివాదాస్పదం అయ్యారు. ఇక టీఆర్ఎస్ తరుపున గెలిచిన కార్పొరేటర్లు నేరుగా కొండాతో వెళ్లకున్నా అంతర్గతంగా సహకరించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా వారి ప్రభావం భారీగానే ఉంది. ఇక వారికి సామాజకవర్గ పరంగా, క్యాడర్ పరంగా నగరంలోని మరో నియోజకవర్గమైన వరంగల్ వెస్ట్, నర్సంపేట, మహబూబాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లోనూ కొంత ప్రభావం చేపగలరు. ఒకవేళ కాంగ్రెస్ తరుపున కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తే టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వనున్నారు. పరకాల నుంచి వారి కూతురు సుశ్మిత పటేల్ పోటీ చేసినా టీఆర్ఎస్ కు టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. అయితే, టీడీపీ నేత రేవూరీ ప్రకాశ్ రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్, టీడీపీల మద్య పొత్తు ఉంటే నర్సంపేటలో కాంగ్రెస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నందున రేవూరిని పరకాల నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో కొండా కూతురికి టిక్కెట్ దక్కదు.

కాంగ్రెస్ కు అదనపు బలమే...

కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి కచ్చితంగా జిల్లాలో అదనపు బలంగా మారనున్నారు. వారు వరంగల్ ఈస్ట్, పరకాల నుంచి పోటీ చేస్తే ఈ రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు భూపాలపల్లిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ అవుతుంది. ఇక నర్సంపేట, మహబూబాబాద్, పాలకుర్తి, వరంగల్ వెస్ట్ లో కూడా వీరు శ్రమిస్తే కాంగ్రెస్ కు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఇండిపెండెంట్ గా పోటీచేస్తే మాత్రం వరంగల్ ఈస్ట్, భూపలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో ప్రధాన పోటీదారులుగా ఉండనున్నారు. మొత్తానికి వీరు టీఆర్ఎస్ నుంచి వెళ్లడం ద్వారా టీఆర్ఎస్ కు మూడు నియోజకవర్గాల్లో నష్టం కలిగే అవకాశం ఉంది. వీరు కాంగ్రెస్ గూటికి వెళ్తే కనీసం నాలుగైదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు కొంత లబ్ధి కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News