2019 ఏప్రిల్ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పాత్ర ఏపీ, జాతీయ రాజకీయాల్లో నామమాత్రం అవుతుందని, ఏపీలోని ఇతర ప్రాంతీయ పార్టీలే కీలకమయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ... కొన్నిరోజుల కింది వరకు ప్రత్యేక హోదా సంజీవని కాదని, ఇప్పుడు ఆయనే ప్రత్యేక హోదానే సర్వరోగ నిరోధిని అంటూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లో భాగంగా ఏపీ రాజకీయాల్లోనూ తమ పాత్ర ఉంటుందని, ఏ రకంగా ఉంటుందో త్వరలో తెలుస్తుందన్నారు. జాతీయ పార్టీల వల్లె ఒరిగేదేమీ లేదని, ఏపీలోనూ బలమైన ప్రాంతీయ శక్తి గెలవాలని తాను బలంగా కోరుకుంటున్నారన్నారు.
కేసీఆర్ ఫ్రంట్ దేశం కోసం... బాబు ఫ్రంట్ తెలుగుదేశం కోసం
కేసీఆర్ ఏర్పాటుచేయాలనుకుంటున్న ఫెడరల్ ఫ్రెంట్ రాష్ట్రాలు, దేశం బలోపేతం కావాలనే దిశగా ఆలోచిస్తుందని, చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఫ్రంట్ అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీని బూచీగా చూపి తన అసమర్ధతను, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తానే ఫ్రంట్ ఏర్పాటుచేస్తున్నట్లు ఏపీ ప్రజలను నమ్మించి రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాము భారతదేశం కోసం పనిచేస్తుంటే చంద్రబాబు మాత్రం తెలుగుదేశం కోసం పని చేస్తున్నారన్నారు. దేశంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ప్రభుత్వం రావాలని, ఈ దిశగా టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 150 స్థానాలు, కాంగ్రెస్ 90 స్థానాలు మించి గెలిచే అవకాశం లేదని, టీఆర్ఎస్ పార్టీకి 16 సీట్లు వచ్చి సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఇప్పటికైనా ఆ మీడియా మారాలి...
ఎన్నికలకు ముందు కొన్ని మీడియా సంస్థలు టీడీపీ అధినేతను, ప్రజలు లేని ప్రజాకూటమిని తెలంగాణ మీద రుద్దడానికి చాలా బలంగా ప్రయత్నం చేశాయన్నారు. గతంలో ఇవే సంస్థలు తెలంగాణ రాకుండా చాలా ప్రయత్నించాయని, అప్పుడూ వాటికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు కూడా అదేరకంగా బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికేనా మీడియా సంస్థలు ప్రపంచాన్ని వారి అజెండాకు అనుగుణంగా నమ్మించే ప్రయత్నాన్ని మారుకోవాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మలచాలనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాను కేసీఆర్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, కానీ తర్వాత రాజకీయంగా నా సామర్థ్యాన్ని నిరూపించుకున్నాని తెలిపారు. 12 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానని, నాలుగుసార్లు భారీ మెజారిటీతో గెలిచానని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఇటీవలి ఎన్నికల్లో నా సత్తాను నిరూపించుకున్నందుకే ముఖ్యమంత్రి తనకు వర్కింగ్ ప్రసిడెంట్ గా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు.