టీఆర్ఎస్ ను తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచేందుకు కృషి చేస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీగా తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. హరీష్ రావు సహా పార్టీ నేతలంతా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పార్టీ ఉండేలా కృషి చేస్తానన్నారు. పార్టీని అజేయశక్తి గా నిలిపేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సహకారం అందించాలని కోరారు. అందరి మద్దతుతో తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లే పనిలో కేసీఆర్ నిమగ్నమైనందునే పార్టీని నడిపించే బాధ్యతను తనకు అప్పగించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ను సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని, వందేళ్ల పాటు పార్టీ ప్రజాసేవలో ఉండేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.