పవన్ కళ్యాణ్ చాలామంది యువతకు ఆరాధ్య దైవం. గోపాలా గోపాలా, బ్రో సినిమాల్లో దేవునిలా కనిపించినా... వీరాభిమానులు మాత్రం ఆయన్ను దేవునిలాగే చూస్తారు. పవన్ గొప్ప నటుడు కాకపోవచ్చు కానీ, మంచి ఎంటర్‌టైనర్. తనవైన టిపికల్ మ్యానరిజమ్స్‌తో యువత మనసుల్ని కొల్లగొడతాడు. పవన్‌ను రాజకీయంగా వ్యతిరేకించినా, ఆయన సినిమా చూడటానికి ఆసక్తి చూపించే వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. ఓ దశాబ్దం పాటు సరైన విజయం లేకపోయినా ఆయన మేనియా తగ్గలేదు.
ఇలాంటి మాస్ ఇమేజ్ ఉన్న ఓ హీరో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడమే అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది. అతిగా ఆవేశపడే గుణం. ఏ విషయంలోనూ నిశ్చితాభిప్రాయం లేకపోవడం (ఒక్క జగన్‌ని ద్వేషించే విషయంలో తప్ప), రాజకీయాల్లో అంకిత భావం కనబర్చకపోవడం పవన్‌కి మైనస్ పాయింట్లు. చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం ప్రారంభమైన నాటి నుంచి పవన్‌లో ఆవేశమే కనిపిస్తోంది. 2009 ఎన్నికల సభలో కాంగ్రెస్ నాయకుల పంచెలూడదీసి కొడతానంటూ చాలా ఉద్రేకంగా ఆయన మాట్లాడారు. ఇటీవల జరుగుతున్న వారాహి యాత్రలో కూడా ఆయనలో అదే ఆవేశం కనిపిస్తోంది. పదిహేనేళ్ల కిందట ఆయన ఆలోచనా విధానం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇది ముఖ్యమంత్రి పదవిపై మనసుపడ్డ నాయకుడి లక్షణం కాదు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పినట్లు తెలుగు దేశం మద్దతు ఉంటె తప్ప ఎమ్మెల్యే గా గెలవలేనని పవన్ అనుమానం కాబోలు.
2019 ఎన్నికల్లో చంద్రబాబుని, లోకేష్‌ని పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇది సోషల్ మీడియా యుగం. ఆ మాటలన్నీ యూట్యూబ్‌లో శాశ్వతంగా ఉంటాయి. వైఎస్సార్సీపీ అభిమానులు ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. వీటికి వివరణ ఇవ్వలేక జనసేన ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఇరుకున పడుతున్నారు. ఇక పవన్ తనది పాతికేళ్ల రాజకీయం అని చెప్పుకుంటారు. అంటే పాతికేళ్లు ఇలానే అర్ధం లేని ఆవేశంతో వ్యవహరిస్తుంటారా? దీనివల్ల పాతికేళ్లయినా, యాభై ఏళ్లయినా ఆయనకు కానీ, ఆయన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కానీ, జనానికి కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు.
రాజకీయాల్లో సిద్ధాంత బలం ఉండాలి. పవన్ కొన్నాళ్లు చేగువేరా ఫోటోలు పెట్టుకుంటారు. మరికొన్నాళ్లు చాతుర్మాస్య దీక్ష అంటారు. జగన్‌ను ద్వేషించడానికి ప్రత్యేకించి కారణం ఉండదు. తన కళ్లముందే ఎదిగి, ముఖ్యమంత్రి కావడమే ప్రధాన కారణం అయి ఉండొచ్చు. లేదా తనను ఎమ్మెల్యేగా గెలవనివ్వని ఉక్రోషం అయినా కావచ్చు. తాను చేసే విమర్శల మీద ఆయన వివరణ ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ లో 30 వేల మంది అమ్మాయిలను కిడ్నాప్ చేశారు అంటారు. తెలంగాణలో తప్పిపోయిన 36 వేల మంది గురించి మాట్లాడరు. ఆయనకు స్వతహాగా నేర్చుకునే తత్వం లేదు. సమకాలీన తెలుగు రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కేసీయార్, జగన్‌ను మించి నాయకత్వ పాఠాలు చెప్పేవారెవరూ ఉండరు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యం అని అందరూ అన్నారు. చాలామంది నమ్మారు. కానీ కేసీయార్ మాత్రం తన ఆశయాన్ని మాత్రం నమ్ముకున్నారు. పోరాడారు. వ్యూహాలు పన్నారు. పదవులకు రాజీనామా చేశారు. గెలిచారు. ఓడారు. దశాబ్దాల కల అయిన తెలంగాణను సాధించారు. తెలంగాణ వాదులకు ఆరాధ్య దైవంగా నిలిచారు.
జగన్ కూడా అంతే. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదహారు నెలలు జైల్లో ఉన్నారు. ఆయన మీద వ్యతిరేక మీడియా అనేక కథనాలు ప్రచురించింది. జైలు పక్షి అంటూ చంద్రబాబు అండ్ కో హేళన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో తృటిలో అధికారాన్ని కోల్పోయారు. అయినా జగన్ చెక్కు చెదర్లేదు. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత జగన్ మీడియా ముందు అన్న మాటలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ‘వాళ్ల టైం వచ్చింది. కొట్టారు. మేం తీసుకున్నాం. మా టైం వస్తుంది. మేమూ కొడతాం’ అంటూ ఆయన దెబ్బ తిన్నట్లు అభినయించి మరీ చూపించారు. జగన్ టైం వచ్చింది. 151 సీట్లతో అనూహ్యమైన మెజార్టీతో గెలిచారు.
సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఓపిగ్గా ఉండి, జనాల్లో తిరిగి, జనం బాధల్ని అర్థం చేసుకుని, వాళ్ల ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని, ఏటికి ఎదురీదిన నాయకులు జగన్, కేసీయార్. కానీ పవన్ పద్ధతేంటో ఎవరికీ అర్ధం కాదు. జన సైనికులు, అభిమానులకు కూడా పవన్ ఇప్పటికీ ప్రహేళిక లాగానే ఉండిపోయారు.