తెలంగాణ ఎన్నికల పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తాను పార్టీలకు అతీతంగా సర్వేలు నిర్వహిస్తున్నానని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత తాను స్వతంత్రంగా ఉన్నారు. సర్వేలు తనకు హాబీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆరునెలల ముందు ఫలితాలు అధిష్టానానికి చెప్పేవాడినన్నారు. తాను నిష్పక్షపాతంగా సర్వేలు నిర్వహిస్తుంటాననిచెప్పారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా సొంత పార్టీ కి ఇష్టంలేకపోయినా తనకున్న సమాచారాన్ని వెల్లడించేవాడినన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. ఎవరితో తనకు అనుబంధం లేదన్నారు. ఈ ఐదేళ్లలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చాలా తక్కువ సార్లుకలిశానన్నారు. వ్యక్తిగతంగా తాను ఏ లాభం కోరుకోలేదన్నారు.
మల్ రెడ్డి దే విజయమట.....
తిరుపతికి వెళ్లినప్పుడు కూడా ఎనిమిది నుంచి పది స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని చెప్పానన్నారు. విలేకర్లు పదే పదే అడిగితే నారాయణ ఖేడ్ నుంచి శివకుమార్ రెడ్డి, బోధ్ నుంచి అనిల్ జాదవ్ గెలుస్తారని చెప్పానన్నారు. తాను పేర్లు చెప్పిన తర్వాత కొంత విమర్శలు చెలరేగాయన్నారు. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి గెలుస్తున్నారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తున్నారని తెలిపారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో తన సన్నిహితులు ఉన్నారు కాబట్టి చెప్పలేకపోతున్నానని అన్నారు. పోలింగ్ శాతం 68.5 శాతానికి ఎక్కువగా వస్తే పూర్తిస్థాయి మెజారిటీతో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని, అంతకంటేతక్కువ వస్తే హంగ్ అసెంబ్లీ వస్తుందని ఆయన జోస్యంచెప్పారు. ఖమ్మం, నల్లొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి ప్రజాకూటమి ఆధిక్యంలోనూ,వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నాయన్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పోటాపోటీగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సీట్లు ఎంఐఎం ఏడుసీట్లు పోను పంచుకుంటాయన్నారు.