ఎం.సత్యనారాయణరావు. ఈ పేరు తెలియని వారుండరు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. మంత్రిగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు నుంచే రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అలాగని పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనించడం లేదని కాదండీ. ఆయన నిశితంగా తెలంగాణ కాంగ్రెస్ లోజరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు చేసిన తప్పిదాలను నిర్మొహమాటంగా చెబుతున్నారు.
నిర్మొహమాటంగా మాట్లాడే.....
ఎం.ఎస్.ఆర్ అంటేనే నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. మైకులున్నాయని మనసులో మాటను దాచిపెట్టుకోలేని మనస్తత్వం ఎమ్మెస్సార్ ది. అలాంటి ఎమ్మెస్సార్ మరోసారి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లోకి తెరపైకి వచ్చారు. అదెలాగంటే.... ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉండటంతో ఆయనను కాంగ్రెస్ నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీనియర్ నేత పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించకుండా ఉంటారా? అంటే ఎలా సాధ్యం? దశాబ్దాలు రాజకీయం చేసిన ఎమ్మెస్సార్ అంత సులువుగా పాలిటిక్స్ ను వీడతారా? కాదు...కాదు...ఇదంతా ఎందుకంటే ఆయన ఇటీవల పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాసిన లేఖ పెద్ద సంచలనంగానే మారింది.
కుట్ర జరుగుతుందంటూ....
అసలు విషయానికొస్తే ఎమ్మెస్సార్ ఇటీవల రాహుల్ గాంధీకి లేఖ రాశారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో వెలమ కులాన్ని తొక్కేసే కుట్ర జరుగుతుందన్నది ఆ లేఖ సారాంశం. అందుకు ఆయన ఉదాహరణలు కూడా చూపారు. ఇటీవల కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్.ఎస్.యూ.ఐ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బాలమూరి వెంకట్రావు గెలిచారు. కాని రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పెద్దలు వెంకట్రావు నియామకాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఎందుకంటే వెంకట్రావు వెలమ కులస్థుడే కారణమన్నది ఎమ్మెఎస్సార్ ఆరోపణ.
రాహుల్ రెస్సాన్స్.....
ఈ విషయాన్నేరాహుల్ కు స్వయంగాలేఖ రాశారు. అయితే రాహుల్ ఎమ్మెఎస్సార్ లేఖకు వెంటనే స్పందించమూ విశేషమే. లేఖ చేరిన వెంటనే వెంకట్రావును ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు పార్టీ అధికార వెబ్ సైట్లో పెట్టారు. అంతేకాదు రాహుల్ స్వయంగా తిరిగి ఎమ్మెఎస్సార్ కు లేఖ రాశారు. ‘‘మీ లాంటి సీనియర్ల సలహాలు, సూచనలు అవసరం. తప్పులు జరిగితే సరిదిద్దుకుంటాం. మీలాంటి వారి సలహాలను పాటిస్తాం’’ అంటూ లేఖ ఎమ్మెఎస్సార్ కు రాహుల్ నుంచి చేరింది. ఇలా ఎమ్మెఎస్సార్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా పార్టీలో జరుగుతున్న తప్పొప్పులను అధిష్టానానికి నివేదించడంలో ముందుంటున్నారు.