కాంగ్రెస్ లో గుజరాత్ గాయం క్రమంగా మారిపోతుంది. దగ్గరకు వచ్చిన అధికారం దూరమయిపోవడానికి ఒక కారణంగా అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలేనన్నది అందరికీ తెలిసిందే. మోదీ సొంత ఇలాకాలో దెబ్బకొట్టి ఉంటే దేశవ్యాప్తంగా మంచి మైలేజీ వచ్చేది. కానీ ఆ ఛాన్స్ మిస్సయింది. కాకుంటే గుజరాత్ లో భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇచ్చామని కొంచెం ఆనందం మాత్రం హస్తం పార్టీకి మిగిలింది.
గుజరాత్ ఎన్నికల్లో.....
అయితే గుజరాత్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాల్లో ఒకరైన మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. మణిశంకర్ అయ్యర్ ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఎందుకంటే గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మోదీ నీచుడంటూ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. అయ్యర్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని ప్రధాని మోదీ తన ప్రచారంలో దీన్నే హైలెట్ చేశారు. ఒక టీ అమ్మే వ్యక్తి ప్రధాని కాకూడదా? వాళ్లు నీచులా? అంటూ మోదీ ప్రచారంలో సూటిగా ప్రశ్నించారు.
సస్పెన్షన్ ఎత్తివేత......
దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మణిశంకర్ అయ్యర్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తర్వాత మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుజరాత్ ఎన్నికలు ముగిసిన ఇన్నాళ్ల తర్వాత అయ్యర్ పై వేటును పార్టీ ఎత్తివేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం చేసిన సిఫార్సు మేరకు అయ్యర్ పై సస్పెన్షన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాహుల్ సూచన మేరకే ఈసస్పెన్షన్ వేటు ఎత్తివేసింది. మొత్తం మీద అయ్యర్ మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ కాబోతున్నారన్నమాట. ఏడాది నుంచి అయ్యర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.