రామన్న రెడీ అవుతున్నాడా?
టీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కె. తారక రామారావు ముఖ్యమంత్రి కావాలని అనేక మంది నేతలు కోరుకుంటున్నారు
టీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కె. తారక రామారావు ముఖ్యమంత్రి కావాలని అనేక మంది నేతలు కోరుకుంటున్నారు. కేటీఆర్ అయితే పార్టీ మరింత పరుగులు తీస్తుందని వారు భావిస్తున్నారు. కేసీఆర్ వ్యూహరచనలు చేస్తూ పార్టీకి అండగా నిలబడాలని ఎక్కువ మంది ఆకాంక్షిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. కేటీఆర్ అందరికీ అందుబాటులో ఉంటారు. ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే ఆయనను కలవడం పెద్ద విషయం కాదు. నియోజకవర్గంలో తమ సమస్యలను ఎప్పటికప్పుడు చెప్పుకునే వీలుంటుందన్నది అధిక శాతం మంది అభిప్రాయంగా వినిపిస్తుంది.
ఎమ్మెల్యేలు అధికంగా...
ప్రశాంత్ కిషోర్ టీం చేసిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడయిందంటున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ ను కలవాలంటే గత ఎనిమిదేళ్ల నుంచి ఎమ్మెల్యేలకు సాధ్యపడటం లేదు. ఆయన నియోజకవర్గాలకు వచ్చినప్పుడు కూడా కలసి వినతి పత్రం సమర్పించడం మినహా తమ బాధలను చెప్పుకునే వీలు దొరకడం లేదు. ఏదున్నా మంత్రిగా ఉన్న కేటీఆర్ కు చెప్పుకోవాల్సిందే. కేటీఆర్ కూడా నిన్న మొన్నటి వరకూ ఎమ్మెల్యేలకు దొరకరు. ప్రగతి భవన్ లోనే ఆయన ఉంటుండటంతో లోపలికి వెళ్లేందుకు కూడా ఎమ్మెల్యేలకు అనుమతి దొరకని పరిస్థితి.
కేటీఆర్ ను కలిసి...
అయితే కేటీఆర్ ఎక్కువగా పర్యటనలు చేస్తుండటంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆయన పర్యటించే ప్రాంతానికి వచ్చి కలసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. కేటీఆర్ తో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నా మేజర్ ప్రాబ్లమ్స్ మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిధుల అవసరం ఎక్కువగా ఉన్న పనులకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ను నియోజకవర్గంలో ఉన్న దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరాలన్నా వీలుకాదు. ఆ సంగతి తెలిసినా ఏదైనా సమస్య పరిష్కారం అవుతుందేమోనని ఎమ్మెల్యేలు కేటీఆర్ ను కలిసి తమ గోడును వినిపిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాలు పార్టీకి ఎంతో అవసరమని, అదే సమయంలో కేటీఆర్ కు బాధ్యతలను అప్పగించడం మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
నేరుగా మాట్లాడేందుకు...
ఇక కేటీఆర్ తో ఇంట్రాక్ట్ అయినట్లుగా కేసీఆర్ తో అనేక మంది కాలేరు. కేసీఆర్ హామీ ఇచ్చినా అది అమలు కాలేదని చెప్పడానికి మరోసారి కలుసుకునే అవకాశం దొరకడం లేదు. అందుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తేలింది. టీఆర్ఎస్ అభిమానులు, ప్రజలు కూడా కేసీఆర్ కంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అందరికీ అందుబాటులో ఉంటారని భావిస్తున్నట్లు పీకే టీం సర్వేలో కూడా తేలింది. తమ సమస్యలను సత్వరం నియోజకవర్గంలో పరిష్కారమయితేనే మళ్లీ గెలిచే ఛాన్సులున్నాయంటున్నారు ఎమ్మెల్యేలు. కేసీఆర్ మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించి తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. మరి అందరూ కోరుకుంటే రామన్న ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందే అయ్యే ఛాన్స్ లేకపోలేదని గులాబీ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.