మీడియా ... ప్రజలను అత్యంత ప్రభావితం చేసే సాధనం. ఇప్పుడు ఇదే మీడియా ఎపి సర్కార్ పాలిట సమస్యగా మారిందా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ విభజనతో ఈ సమస్య ఏర్పడినట్లు చెప్పొచ్చు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మీడియా మాత్రం ఒక్కటిగానే భాషాపరంగా ఉండాలిసిన పరిస్థితి. అదీ కూడా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగానే మీడియా పనిచేస్తుంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీలకు నొప్పించక తానొవ్వక అన్న రీతిలో వ్యవహారం సాగించే పరిస్థితి కొనసాగుతుంది.
నిత్యం పోలికే ...?
రాష్ట్రం సాంకేతికంగా విడిపడిన మాటే కానీ రెండు ప్రాంతాల్లో ప్రసారం అయ్యే వార్తలు ఇరు రాష్ట్ర ప్రజలకు ఆసక్తే. దాంతో ఏ రాష్ట్ర సర్కార్ ఎలా నడుస్తుంది. ఏ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తుంది. రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు అక్కడ అలా ఇక్కడ ఇలా అనే పోలికలు నిత్యం జనంలో చర్చకు కారణం అవుతున్నాయి. దాంతో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు ప్రతి రోజు అందరు పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఆ పోలిక ఒక రకంగా ప్రస్తుతం వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి ఎదుర్కొవాలిసిన స్థితిలో ఏపీలో అధికారంలో వున్న తెలుగుదేశానికి లేనిపోని ఇబ్బందులు ఏర్పడేలా చేసింది. తాజాగా చంద్రబాబు, కెసిఆర్ నడుమ తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న పోలిక కొత్త సమస్యలకు తెరతీసేలా సాగుతుంది. దాంతో తెలుగు మీడియా పరిస్థితి కూడా అడ్డకత్తెరలో పోకచెక్కలా మారింది.