కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడంటే?
ప్రపంచానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు
ప్రపంచానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షల్లో ప్రజలు ఈ వైరస్ బారిన పడే అవకాశముందని చెబుతున్నారు. అత్యధిక మంది మరణించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ చైనాను వణికిస్తుంది. గంటల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అక్కడ లాక్ డౌన్ విధించినా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో లాక్ డౌన్ ను ఎత్తివేశారు.
చైనాలో గంటకు డబుల్...
లాక్‌డౌన్ ఎత్తివేసిన నాటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫస్ట్, సెకండ్ వేవ్ ల కంటే థర్డ్ వేవ్ మరింత ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు నెలల్లో థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో అత్యధికంగా 60 శాతం మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడనున్నారని, ప్రపంచంలో పది శాతం మందికి వైరస్ సోకవచ్చన్నది ప్రాధమిక అంచనాగా తెలుస్తోంది.
మూడో వేవ్ మూడు నెలల్లో...
కరోనా వైరస్ రెండు వేవ్ ల తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్ వేయించుకుని కొంత ఇమ్యునిటీని పెంచుకోగలిగారు. కొన్ని దేశాల్లో బూస్టర్ డోస్ కూడా పూర్తయింది. అయితే మూడో వేవ్ మరింత ఎక్కువగా వస్తుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ తెలిపారు. ఊహించని విధంగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని, ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలను కూడా పాటించడం లేదు. మాస్క్ లు ధరించడం లేదు. భౌతిక దూరాన్ని పాటించడం లేదు. మాస్క్ ల కొనుగోళ్లు కూడా పూర్తిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ మరింత ఎక్కువగా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.