Weather Report : వారం రోజులు వర్షాలేనట.. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.;

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. విశాఖ వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాజస్థాన్ - కోస్తాంధ్ర మధ్య ఉపరితలద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ ద్రోణి విస్తరించి ఉన్నందున విస్తారంగా వర్షాలు పడతాయని, ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయికి చేరుకుంటాయని వాతావరణం తెలిపింది.
అన్నదాతలను ముంచేసిన...
గురువారం నుంచి వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో పడుతున్నాయి. అయితే అకాల వర్షాలకు సామాన్య ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నప్పటికీ అన్నదాతలు మాత్రం చాలా వరకూ నష్టపోతున్నారు. అకాల వర్షంతో పంటలు తీవ్రంగా నష్టపోయారు. మిరప, పొగాకు, బొప్పాయి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినప్పటికీ చేతికొచ్చిన పంట అకాల వర్షం కారణంగా చేజారి పోయిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణలో మాత్రం...
తెలంగాణలో మాత్రం రెండు రోజులు వర్షాలుపడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ వాఖతెలిపింది. పగలు ఉష్ణోగ్రతలు పెరిగినా సాయంత్రానికి చల్లబడుతుందని, వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం వరకూ అనేక జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.