ఎందుకా తొందర..?
దశాబ్దాలుగా వేచి చూస్తున్న మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం లభించనుంది. ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అత్యంత కీలకమైన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందనుంది. దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్న స్త్రీ జాతికి మోదీ ప్రభుత్వం అందిస్తున్న అపురూప కానుక ఇది. అయితే ఇలాంటి బిల్లుపై కూలంకష, అర్థవంతమైన చర్చకు అవకాశం లేకుండా కేవలం రెండు మూడ్రోజుల్లోనే ఆమోదించడం ఎంతవరకూ సరైనదో కేంద్ర పెద్దలే చెప్పాలి.
కీలక బిల్లులపై బీజేపీ మార్కు గాభరా!

కేవలం ఈ బిల్లే కాదు. మోదీ సర్కారు హయాంలో కొన్ని కీలక బిల్లులు కేవలం రెండ్రోజుల్లోనే చట్టాలుగా మారిన సందర్భాలున్నాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా రెండ్రోజుల్లో చట్టం చేసేశారు. రిజర్వేషన్ల వెనుక సామాజిక కోణమే చూడాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ల ఫలాలు అందించాలని బీజేపీ భావించింది. దీనివల్ల రిజర్వేషన్లపై ఆయా వర్గాలకు ఉన్న వ్యతిరేకత కొంత తగ్గుతుందని, తమకు రాజకీయంగా లాభిస్తుందని మోదీ ప్రభుత్వం భావించింది. గత ఎన్నికలకు ముందు సరిగ్గా రెండ్రోజుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. ఈ బిల్లును కేంద్ర క్యాబినెట్ 2019 జనవరి ఏడో తేదీన ఆమోదిస్తే, ఎనిమిదిన లోకసభ, తొమ్మిదో తేదీన రాజ్యసభ ఆమోదించి, చట్టం చేశాయి. అనుకున్నట్లుగానే ఇది బీజేపీకి సానుకూలంగా మారింది.
ఇలాంటి మరో అత్యంత కీలకమైన, వివాదాస్పద బిల్లు ఆర్టికల్ 370 రద్దు. ఎంతో మంది హిందూవాదులు కలగన్న బిల్లు. మరికొంతమంది రాజకీయ నాయకులకు పీడకలను మిగిల్చిన బిల్లు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా చివరి వరకూ అత్యంత రహస్యంగా ఉంచారు. చివరకు 2019 అక్టోబర్ 5న రాజ్యసభలో, ఆరో తేదీన లోక్‌సభలో ఆమోదం పొంది, దశాబ్దాల జమ్ము, కశ్మీర్ ఉనికిని మార్చేసింది. ప్రజాస్వామ్యంలో చర్చకు అవకాశం ఉండాలి. ప్రతిపక్షాల గొంతు వినిపించాలి. వాళ్ల సూచనలను సానుకూలంగా తీసుకోవాలి. వాళ్లు కూడా ప్రజాప్రతినిధులని, వాళ్లకూ బాధ్యత ఉందని ప్రభుత్వాలు గుర్తించాలి. కానీ ముందే బిల్లులు తయారు చేసి, ఒకరోజులో చర్చ ముగించి, రెండో రోజుకు చట్టంగా మార్చడం... డెబ్బయ్ అయిదేళ్ల ప్రజాస్వామ్య దేశానికి శోభస్కరం కాదు.