మునుగోడు ఓటరు డిసైడ్ అయిపోయారా?
మునుగోడు ఉప ఎన్నికలకు ఇంకా గంటలు మాత్రమే సమయం ఉంది. ఓటరు ఇప్పటికై డిసైడ్ అయ్యారు.
పార్టీలు ఎందుకు మారతారు? సిద్ధాంతాలు నచ్చా? ఉన్న పార్టీలో ఆశయాలు నచ్చకా? అంటే నవ్వుకోవాల్సి వస్తుంది. ఎవరి ప్రయోజనం వాళ్లది. రాజకీయ అవకాశాల కోసమే పార్టీలు మారతారన్నది వాస్తవం. ఎందుకంటే మిగిలిన సమయాల్లో ఎవరినీ ఏ పార్టీ పెద్దగా పట్టించుకోదు. ఏ పార్టీ హైకమాండ్ కయినా ఇన్‌స్టంట్ నేతలే అవసరం. అప్పటికి అవసరం వచ్చిన నేతలతోనే ఆ పార్టీ అధినాయకత్వం మంచిగా ఉంటుంది. ఏళ్ల తరబడి అదే పార్టీలో ఉన్నా ఆ నేతలను పట్టించుకోదు. ఎన్నికల తర్వాత మళ్లీ అధినాయకత్వాలదీ అదే దారి. నేతల బాధ అంతే. మునుగోడు ఉప ఎన్నికలకు ఇంకా గంటలు మాత్రమే సమయం ఉంది. ఓటరు ఇప్పటికై డిసైడ్ అయ్యారు.
పార్టీలు మారడం...
పార్టీలు మారడం ఎక్కువయింది. సులువుగా పార్టీలు మార్చేస్తున్నారు. పార్టీ గతంలో ఎందుకు వీడారో? అప్పుడు చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలు గుర్తుండవు. తిరిగి అదే పార్టీ ముద్దుగా కనపడుతుంది. పార్టీ మారే నేతలందరూ అమ్ముడవుతున్నారన్నది కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో సిద్ధాంతాలు, చేసిన అభివృద్ధి నచ్చి చేరామని చెప్పడం కూడా అంతే ట్రాష్. కేవలం పదవులు భవిష్యత్ లో ఇస్తామని ఇస్తున్న హామీల మేరకే పార్టీలు మారుతున్నారు. మరో పార్టీలో చేరుతున్నారు. ఒక పార్టీ నేత మరొక పార్టీలోకి మారినంత మాత్రాన వీడిన పార్టీకి పెద్దగా పోయేదేమీ ఉండదు. అలాగే చేరిన పార్టీకి ప్రయోజనం కూడా ఉండదు.
హైప్ కోసమే...
కానీ ఎన్నికల్లో ఎంతో కొంత హైప్ వస్తుందనే పార్టీలో చేర్చుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఈ చేరికలు గొడవ పెద్దగా కనపడదు. వినపడదు. ఆ యా సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకునేందుకు ఇది ఒక ఆట మాత్రమే. అయితే ఆ నేతలు చేరినంత మాత్రాన గంపగుత్తగా ఓట్లు వచ్చి పడే అవకాశం లేదు. ఓటర్లు ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటారు. తాము ఎవరిని ఎన్నుకోవాలో? ఎవరికి ఓటేయాలో అన్నది నేతలను బట్టి ఓటర్లు డిసైడ్ కారు. తమకున్న పరిస్థితులు, భవిష్యత్ లో తమ గ్రామానికి, తమకు, తమ నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరుదని అనుకున్న పార్టీకే ఓటు వేస్తారు.
ప్రచారం కూడా...
ప్రచారం కూడా పెద్దగా పనిచేయదు. ఉపన్యాసాలు కూడా ఎందుకూ పనికి రావు. ఎందుకంటే ఒక ఓటరు డిసైడ్ అయ్యారంటే ఎవరెన్ని చెప్పినా తాను అనుకున్న వారికే ఓటేస్తారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లోనూ అంతే. తాను అనుకున్న వారికే ఓటరు బటన్ నొక్కుతారు. ఎన్నికలకు ముందు ఎన్ని ప్రలోభాలు పెట్టినా అవి పెద్దగా పనిచేయవన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మునుగోడు ఉపఎన్నికే కాదు. ఏ ఎన్నికైనా అంతే. అందుకే రాజకీయ పార్టీలు ప్రచారం కోసం పెట్టే కోట్ల రూపాయల ఖర్చు వృధాకాక తప్పదు. అంతేకాదు చేర్చుకున్న నేతల వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారన్నది ఓటరే తేలుస్తారు తప్ప. ఈ ప్రచారాలు కాదు. ఈ నేతలు కాదన్నది వాస్తవం.