ఓదేలు ఒగ్గుతారా? సై అంటారా?

Update: 2018-09-13 00:30 GMT

నల్లాల ఓదేలు... నిన్నమొన్నటి వరకూ తన పని తాను చేసుకుపోయే ఒక ఎమ్మెల్యే మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ లో పనిచేసిన ఓదేలుకు ఇటీవల ప్రకటించిన జాబితాలో చుక్కెదురయింది. చెన్నూరు నియోజకవర్గం నుంచి నల్లాల ఓదేలును, ఆంథోల్ నియోజకవర్గం నుంచి బాబూ మోహన్ ను తప్పించి తొలి జాబితాలో అక్కడ కొత్త వారికి ప్రకటించారు. చెన్నూరు నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ కు, ఆంథోల్ నియోజకవర్గంలో జర్నలిస్ట్ క్రాంతికి సీట్లు ఇచ్చారు. బాబూ మోహన్ కేసీఆర్ బుజ్జగించడంతో కొంత నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ నల్లాల ఓదేలు మాత్రం ఊరుకునేటట్లు లేరు. తనకు సీటు ఇవ్వకుంటే సుమన్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పడంతో టీఆర్ఎస్ అప్రమత్తమయింది.

సుమన్ ప్రచారాన్ని అడ్డుకుని.....

దీంతో నల్లాల ఓదేలు ఒకరోజంతా కుటుంబ సభ్యులతో కలసి స్వీయ నిర్భంధం తన ఇంట్లోనే విధించుకుని టీఆర్ఎస్ అధిష్టానానికి హెచ్చరికలు పంపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఫోన్ చేసి మరీ తనను కలవాలని సూచించారు. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే ఎంపీ బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ప్రారంభించడం ఓదేలు వర్గంలో కలకలం రేపింది. సుమన్ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఓదేలు వర్గానికి చెందిన గట్టయ్య అనే వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని బాల్క సుమన్ కు వ్యతిరేకంగా తన నిరసనను తెలియజేశారు. అయితే సుమన్ మాత్రం తనపై హత్యాప్రయత్నం జరిగిందని, తన గన్ మెన్లు, కార్యకర్తల రక్షణతో బయటపడ్డానని అంటున్నారు. ఇక్కడే గెలిచి కేసీఆర్ కు చెన్నూరును కానుకగా ఇస్తానంటున్నారు.

సుమన్ మార్చేశాడంటున్న......

కాని ఓదేలు మాత్రం సుమన్ కుట్రల వల్లనే తనకు టిక్కెట్ దక్కలేదని బహిరంగంగా చెబుతున్నారు. సుమన్ ఇంటలిజెన్స్ అధికారులను మేనేజ్ చేసి తనకు అనుకూలంగా వచ్చిన రిపోర్ట్ ను మార్చారన్నది ఓదేలు ఆరోపణ. కేవలం ఎమ్మెల్యే టిక్కెట్ పొందడం కోసమే సుమన్ తనపై కుట్రలకు దిగారంటున్నారు. స్థానికేతరుడైన సుమన్ తన నియోజకవర్గంలో ఎలా పోటీ చేస్తారని ఓదేలు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ కేసీఆర్ రీసర్వే చేస్తే అసలు విషయం బయటపడుతుందని ఓదేలు చెబుతున్నారు. అయితే ఓదేలు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న అంగీకరించేది లేదని చెబుతున్నారు. తాను చెన్నూరు ప్రజల సహకారంతోనే తిరిగి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ బుజ్జగింపులతో ఓదేలు ఒగ్గుతాడా? లేక పోటీకి దిగుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇబ్బందికర పరిస్థితే......

టీఆర్ఎస్ అధిష్టానానికి కూడా ఇప్పుడు అభ్యర్థిని మార్చడం ఇబ్బందికరమే. చెన్నూరులో అభ్యర్థిని మారుస్తున్నట్లు ఇప్పుడు ప్రకటిస్తే మిగిలిన నియోజకవర్గాల నుంచి అసంతృప్తులతో ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతుందని, కేసీఆర్ ఇక అభ్యర్థులను మార్చే ప్రసక్తి లేదన్నది టీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. ఓదేలు మాత్రం తనకు టిక్కెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగి తన సత్తా చూపిస్తానని చెబుతున్నారు. మొత్తం మీద చెన్నూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయని చెప్పొచ్చు.

Similar News