జగన్ జుట్టు వెనక గుట్టు అదేనా ఆర్కే గారూ?
వంగవీటి రంగా హత్యతో కాపులకు, కమ్మలకు చిచ్చుపెట్టింది వైఎస్ అట. అందుకే 1989లో ఎన్టీఆర్ ఓడిపోయారట
విశ్వసనీయత వీళ్ల వద్దనే ఉంటుంది. ప్రజాస్వామ్యం వీళ్ల పంచనే ఉంటుంది. అభివృద్ధి అంతా వారి హయాంలోనే ఉంటుంది. తాము చేస్తే సంసారం.. అవతలి వాళ్లు చేస్తే...? అన్న రీతిలో చంద్రబాబుకు చెందిన ఒక వర్గం మీడియా ఆపసోపాలు పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రతి వారం రాసే కొత్తపలుకు లో మరోసారి ఇది స్పష్టమయింది. ఎన్టీఆర్ మహానాయకుడు. ఆయన తెలుగు గౌరవానికి ప్రతీక. కాదెన్నదెవరు. కానీ నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటాన్ని కూడా సమర్థించుకుంటూ ఆర్కే చేసిన అక్షర విన్యాసం గురించి ఇక్కడ చెప్పుకోక తప్పదు. బటన్ లు నొక్కితే చాలట. జగన్ జుట్టుకు... జరుగుతున్న పరిణామాలకు లింకేమిటో? జగన్ జుట్టు సంగతి సరే. చంద్రబాబు జుట్టు రాలిపోకుండా తైలం ఎప్పటికప్పుడు రాస్తుందెవరో?
వైఎస్ ఇబ్బంది పెట్టారా?
లక్ష్మీపార్వతి వల్లనే తిరుగుబాటు వచ్చిందని ఎప్పటి నుంచో అనుకూల పత్రికలన్నీ చెబుతున్నాయి. ఆయన రాజ్యాంగేతర శక్తిగా మారినందునే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారన్న చర్విత చరణమే. అయితే ఆర్కే ఇప్పుడు కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అట. పులివెందుల మార్క్ కుట్రలతో ఎన్టీఆర్ ను వైఎస్ వేధించారట. వంగవీటి రంగా హత్యతో కాపులకు, కమ్మలకు చిచ్చుపెట్టింది వైఎస్ అట. అందుకే 1989లో ఎన్టీఆర్ ఓడిపోయారట. వైఎస్ తెలుగుగంగ నికర జలాలకు కావాలని వైఎస్ నిరసన చేశారట. ఎన్టీఆర్ సెక్రటేరియట్ కు పోకుండా అడ్డుకుంది వైఎస అట. చంద్రబాబుకు మించి వైఎస్ దెబ్బకు ఎన్టీఆర్ విలవిలలాడిపోయారట. అది ఆయన ఉలుకుపలుకులో చెప్పదలచుకున్నది. ఇక జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించడం సమర్థించే వాళ్లున్నారు. అభ్యంతరం చెప్పేవాళ్లున్నారు. ఎవరి అభిప్రాయం వారిది. మీరు చెప్పినట్లే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు నడవాలంటే కష్టం. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లు యుగపురుషుడు ఎన్టీఆర్ పేరు తొలగించరు. కానీ పదవి నుంచి మాత్రం దించేయవచ్చు.
అవును ప్రేమే మరి...
జగన్ కు వైఎస్ పై ప్రేమ లేదు. కానీ ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు వల్లమాలిన అభిమానం. ఆయనకున్న అభిమానం, ప్రేమ, ఆప్యాయతలను జగన్ ప్రజల మనసులో నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారట. అది రోత పుట్టిస్తున్నాయట. ఎన్టీఆర్ ద్వేషిగా చంద్రబాబును చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారట. అవును. నిజమేలెండి. ఆయనంటే చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ. ఆయన కుటుంబమన్నా అంతకంటే మక్కువ. దగ్గుబాటి వెంకటేశ్వరరావును 1995లో జరిగిన తిరుగుబాటులో వాడుకుని వదిలేసిందెవరో? దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దగ్గుబాటిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందెవరో? అమాయకుడైన హరికృష్ణ ఎప్పటికైనా మేకవుతాడని భావించి దూరం పెట్టింది ఎవరు? తీరా తాను కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అందరూ గుర్తుకు వస్తారు. ఇది ఎవరి మాటో కాదు. స్వయానా మాజీ అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రాద్ చెప్పిన మాటలే.
పలుకులో ఆ ఉలుకెందుకో?
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేయాలన్న తన ఆలోచనపై విషప్రచారం చేస్తున్నారన్నారు. వాడు అన్నది ఎన్టీఆర్ ను కాదట. జగన్ అట. మరి జగన్ ను ఆ మాట అనడం సంస్కారమేనా? కనీసం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని నాటి ప్రధాని వాజపేయి భావిస్తే లక్ష్మీపార్వతికి ఆ క్రెడిట్ దక్కుతుందని అడ్డుపడిందని కూడా ఆయన చెప్పారు. మరి యార్లగడ్డ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేకపోయారు? ఆయన నోటి నుంచి వస్తే నిజాలనా? లేక మరోసారి ప్రజలకు చేరవేసేదెందుకనా? ఎన్టీఆర్ ను ప్రజల మనసుల్లో నుంచి తొలగించాలని కుట్ర చేసిందెవరు? పార్టీని చేతుల్లోకి తీసుకుని నలభై ఏళ్ల పాటు ఎన్టీఆర్ కుటుంబాన్ని పక్కన పెట్టిందెవరు? ఎన్టీఆర్ ను అవమానించే సాహసానికి జగన్ ఒడిగట్టారా? చంద్రబాబు సాహసించారా? అన్నది తెలుగు ప్రజలకు తెలియంది కాదు. వంగవీటి రంగా హత్య నుంచి ఎన్టీఆర్ ను దించేయడం వరకూ ఈ జనరేషన్ కు తెలియకపోవచ్చు. అప్పటి వారిని అడిగితే చెబుతారు. చరిత్రను ఎవరూ మార్చలేరు. వక్రీకరించడానికి ప్రయత్నించినా అది చెల్లదు. అలాగే జరిగిన సంఘటనలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అవి మంచి పనులైనా. చెడ్డపనులైనా. రాజకీయాల్లో అటువంటి వాటికి మినహాయింపులు ఉండబోవు సర్.