ఆయనవైపే బాబు మొగ్గు...?

Update: 2018-09-22 02:30 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేట నియామకం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పదవి కాలం నెలాఖరు తో ముగియ నుండటంతో ఆయన స్థానంలో అనిల్ చంద్ర పునేట ని నియమిస్తారని సచివాలయంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరులోగానే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.

పునేట పేరు ఖాయమేనా?

ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గా అనిల్ చంద్ర పునేట పేరు ఖాయం అయినట్టు తెలుస్తోంది.ఏపీ చీఫ్ సెక్రటరీ పదవి ఆశిస్తున్న వారిలో నలుగురు ఐదుగురు పేర్లు ప్రధానంగా వినిపుస్తున్నా ముఖ్యమంత్రి పునేట వైపే మొగ్గు చూపుతున్నారు. దాదాపు ఆరు నెలల నుంచి పలువురు ఐ ఏ ఎస్ అధికారులు ప్రధాన కార్యదర్శి పదవి కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ పదవి ఆశిస్తున్న వారిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కేంద్ర సర్వీస్ లో ఉన్న పీవీ రమేష్ ఉన్నారు. ఎల్వీ సుబ్రమణ్యం గతంలో కూడా చీఫ్ సెక్రటరీ రేస్ లో ఉన్నా సీబీఐ కేసు ల కారణంగా ఆయనకు ఆ పదవి దక్కలేదు. ఇటీవల ఆయనకు సీబీఐ నుంచి కూడా క్లీన్ చిట్ లభించింది. దీంతో ఆయన ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తన పేరు పరిశీలించాలని కోరినట్టు సమాచారం.

వీఆర్ఎస్ తీసుకుంటారంటూ.....

అయితే సీఎం మాత్రం పునేట వైపు మొగ్గు చూపుతున్నారని అధికార వర్గాలలో ప్రచారం జరుగుతోంది. మరో అధికారి సతీష్ చంద్ర తర్వాత అయినా తనకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. పునేట కు సీఎస్ పదవి దక్కితే సతీష్ చంద్ర సీసీఎల్ఎ కానున్నారు.మరో వైపు ఈ పరిణామాలపై మనస్తాపం చెందిన ఎల్వీ సుబ్రమణ్యం స్వచ్ఛంద పదవి విరమణ యోచనలో ఉన్నారని చెబుతున్నారు. నెలాఖరున కొత్త సీఎస్ పేరు ప్రకటించే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారని చెబుతున్నారు.తనకంటే జూనియర్ కింద పని చేయలేక పదవి విరమణ చేయడమో, కేంద్ర సర్వీస్ లకు వెళ్లాడమో చేస్తారనే చర్చ జరుగుతోంది.

Similar News