బాబు బాజాకు ఇన్ని నిధులా?

Update: 2018-09-29 03:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ప్రతి అడుగూ వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన కోసమంటూ జిల్లాల వారీగా ధర్మ పోరాట దీక్ష సభలను పెడుతున్న చంద్రబాబు వాటిని ఎలా సాధిస్తారో చెప్పడం లేదు. భారతీయ జనతా పార్టీని ఓడించాలని మాత్రం ప్రతి సభలో పిలుపునిస్తున్నారు. నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీతో కలసి నడిచిన చంద్రబాబు అప్పట్లో విభజన హామీలు గుర్తుకు రాలేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రధానిగా మోదీ వస్తే ప్రత్యేక హోదా ఎలా సాధ్యమవుతుంది.? మోదీ స్థానంలో రాహుల్ వచ్చినా ఆయన తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే చేస్తానంటున్నారు. ఇప్పటికిప్పుడు మోదీ ప్రత్యేకహోదా ఇచ్చేది లేదన్నది అందరికీ తెలిసిందే. మరి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు దేనికోసం అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

దుబారా కాదా?

ధర్మ పోరాట దీక్షలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఖర్చుతో దుబారా చేయడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నా మానుకోవడం లేదు. పోనీ ఈ సభల వల్ల సమస్యలు పరిష్కారమవుతాయంటే దానిపైనా ఎవరికీ వేరే అనుమానం లేదు. అవి ఇప్పట్లో సాధ్యం కావన్నవి అందరికీ తెలిసిందే. కాని సభల పేరిట విభజన సమస్యలను పరిష్కరించకుండా భారతీయ జనతా పార్టీ చేసిన మోసాన్ని ప్రస్తావిస్తూ, తనకు మరోసారి అవకాశం ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామంటూ ప్రచారం చేసుకోవడానికే ఈ సభలు ఉపయోగపడుతున్నాయన్నది వాస్తవం.

నేడు పశ్చిమ గోదావరిలో....

ఈ నెల 29వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ధర్మపోరాట దీక్ష సభ జరగనుంది. ఈసభకు రెండు, మూడు రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసిన ధర్మపోరాట దీక్ష సభలో అదే ప్రసంగం...అదే విమర్శలు. ఇవి ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు టీం సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిధులేంచేశారు....?

అసలే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే తెలుగుదేశం ప్రచార సభలకు నిధులను ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఈ ధర్మ పోరాట దీక్షలపై మండిపడుతోంది. ఎన్టీఏ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఎంజీఆర్ఎస్ నిధుల కింద రాష్ట్రానికి 27 వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందని, ఈ నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎంతమేరకు నెరవేరుస్తున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ధర్మపోరాట దీక్షలు, జ్ఞాన భేరి సభలకు ఇప్పటి వరకూ ఎంత వెచ్చించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Similar News