ముఖ్యమంత్రికి కోపం వచ్చింది ...!!

Update: 2018-09-02 06:30 GMT

ఎన్నికల ఏడాది కావడంతో ఎపి సిఎం చంద్రబాబు పాలన పై గట్టిగానే దృష్టి పెట్టారు. గత నాలుగేళ్ళుగా అధికార యంత్రాంగం ఎన్ని పెద్ద తప్పులు చేసినా చూసి చూడనట్లు పోయిన చంద్రబాబు ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి అధికారుల అలసత్వంపై ఆగ్రహం ప్రదర్శించారు. అనంతపురం, కృష్ణ, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలలో సీజనల్ వ్యాధులు ప్రబలడం, డెంగ్యూ కేసులు నమోదు కావడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. అవినీతి కి చిరునామాగా వైద్య ఆరోగ్య శాఖ కురుకుపోయిందంటూ ఘాటుగా స్పందించారు.

పూనం పై కూడా ...

ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్న పూనం మాలకొండయ్య పనితీరుపైకూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు పనిచేయడం చేతకాకపోతే తాను స్వయంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి సంగతి తెలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు బాబు. వాస్తవానికి చంద్రబాబు కు దేశంలోనే మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరుంది. 95 నుంచి 2004 వరకు 9 ఏళ్ళు సీఎంగా ప్రజల్లో బాబు కు మంచి మార్కులే పడ్డాయి కూడా. అయితే 2014 తరువాత విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాకా ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. అధికార యంత్రాంగం లో ఎలాంటి పొరపాట్లు దొర్లినా నిర్లిప్త వైఖరి అవలంభిస్తూ వచ్చారు.

బాబు వార్నింగ్ తో.....

పూర్తి ఓటు బ్యాంక్ దృష్టి తోనే ఆయన కార్య్రక్రమాలు చేస్తూ వస్తున్నారు. అది సామాన్యులు కావొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావొచ్చు ఆయన నిర్ణయాలు ఓట్ల చుట్టూ పరిభ్రమిస్తూ ఉండటంతో ప్రభుత్వ శాఖల్లో అలసత్వం పురివిప్పి నాట్యం చేస్తుంది. మంత్రి వర్గం నుంచి బిజెపి మంత్రులు వైదొలిగాకా కామినేని శ్రీనివాస్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారు. పని వత్తిడితో ఆయన ఈశాఖపై సరైన దృష్టి పెట్టక పోవడంతో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ పనితీరు పూర్తిగా పడకేసింది. తాజాగా బాబు వార్నింగ్ తో అయినా ఈ శాఖ గాడిన పడుతుందో లేదో చూడాలి.

Similar News