బాబుకు అరెస్ట్ వారెంట్ .... అడ్డంగా వాడేస్తున్న టిడిపి ...?

Update: 2018-09-14 01:43 GMT

బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో టిడిపి అధినేత సహా 16 మందికి ధర్మాబాద్ కోర్ట్ ఇచ్చిన అరెస్ట్ వారెంట్ సంచలనంగా మారింది. రొటీన్ గా కోర్టు లు చేసే ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ లో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టిడిపి కి ఆయుధంగా మారింది. ప్రతిపక్ష హోదాలో బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గరకు అనుమతి లేకుండా వెళ్ళడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్న అభియోగాలపై మహారాష్ట్ర పోలీసులు 2010 లో పెట్టిన కేసులో ఆ సమయంలోనే చంద్రబాబు ఆయన బృందం అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకోవడానికి సైతం నిరాకరించింది. ఈ కేసు అప్పటినుంచి పెండింగ్ లోనే ఉండటంతో మేజిస్ట్రేట్ తప్పు పట్టి నిందితులకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

ఇది సర్వసాధారణమే......

క్రిమినల్ కేసుల్లో ఇటువంటివి హాజరుకాకపోయినా అరెస్ట్ వారెంట్ లు ఇవ్వడం సర్వ సాధారణంగా జరిగే అంశం. కానీ మంచి ఎన్నికల వేడి మీద వున్న సమయంలో ఎపి ముఖ్యమంత్రి హోదా లో వున్న వ్యక్తికి ఈ వారెంట్లు జారీ చేయడాన్ని టిడిపి అవకాశంగా మలుచుకుని ఇదంతా మోడీ కుట్ర అంటూ మోతెక్కించేస్తుంది. మహారాష్ట్రలో బిజెపి సర్కార్ కొలువై ఉండటం కూడా టిడిపి కి కలిసొచ్చే అంశమే. కేంద్రమే తమ మీద ఇలాంటివన్నీ ప్రయోగిస్తుందన్న ప్రచారానికి ఆ అంశం కూడా ఉపయోగపడుతుందంటున్నారు విశ్లేషకులు.

బాబు తో బాటు ...

సిఆర్పీసీ సెక్షన్ 70 కింద ఈ అరెస్ట్ వారెంట్ ను మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఎన్. ఆర్ గజిబియే జారీ చేశారు. నిందితులు 16 మందిపై ఐపిసి సెక్షన్లు 353,324,332,336,337,323,504,506,109,34 కింద కేసు నమోదైందని వారెంట్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ఒక పక్క లబ్ది పొందే వ్యూహం అమలు చేస్తూనే మరోపక్క న్యాయ నిపుణులతో బాబు సంప్రదిస్తున్నారు. 2010 లో జరిగిన బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర ఆందోళన ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడంతో తెలంగాణ ఎన్నికల్లో ఈ అంశాన్ని టిడిపి పూర్తిగా వినియోగించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ ప్రాంతంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్ట్ లకు చంద్రబాబు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఇప్పటికే టీఆరెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గతం నుంచి తెలంగాణ రైతాంగం కోసం పోరాటానికి దిగిన అంశాన్ని టిడిపి ఇప్పుడు గట్టిగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆ దిశగా ఇప్పటికే టిడిపి వేడి రగిల్చింది కూడా.

అరెస్ట్ వారెంట్ వచ్చింది వీరికే ...

1. నారా చంద్రబాబు నాయుడు ( ఎపి ముఖ్యమంత్రి )

2. జి. కమలాకర్ ( కరీంనగర్ )

3. కె. ఎస్ ఎన్ ఎస్ రాజు ( ఎపి )

4. చింతమనేని ప్రభాకర్ ( ఎమ్మెల్యే)

5. ఎన్. నాగేశ్వర్ మల్లేశ్వర ( తెలంగాణ )

6 జి. రామానాయుడు

7. దేవినేని ఉమా మహేశ్వర రావు ( ఎపి మంత్రి )

8 సిహెచ్ విజయ రామారావు ( తెలంగాణ )

9. ముజాఫరుద్ధీన్ ( తెలంగాణ )

10. హనుమంత్ షిండే ( నిజామాబాద్ )

11.పి అబ్దుల్ ఖాన్ ( ఎపి )

12 ఎస్ సోమ్ జోజు ( ఎపి )

13 ఎ ఎస్ రత్నం ( సాయన్న ) ( తెలంగాణ )

14 పి. సత్యనారాయణ ( ఎపి )

15 టి ప్రకాష్ గౌడ్ (ఎపి )

16 ఎన్ ఆనందబాబు ( ఎపి )

Similar News