తెలంగాణ ప్రభుత్వం రద్దయింది. టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వేసిన అడుగులు.. ఎన్నికలకు దారితీస్తున్నాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది అక్టోబరు అంటే మరో నెల రోజుల్లోనే తెలంగాణ ఎన్నికలకు వెళ్లనుంది. డిసెంబరులో తొలి వారంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం వంటివి వడివడి గా జరిగిపోనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చాలా సుదీర్గంగా ఓపికగా మాట్టాడిన కేసీఆర్ అనేక ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు. తనదైన శైలిలో విపక్షాలకు చురకలు అంటిస్తూ.. పాత్రికేయుల ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు కోసం తహతహలాడుతున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై మళ్లీ నిప్పులు చెరిగారు కేసీఆర్.
పొత్తుల కోసం......
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుకంటున్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు చెక్ పెట్టే క్రమంలో అంది వచ్చిన ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమంటోంది. ఇక, ఇప్పటికే చావు తప్పి.. కన్ను లొట్టపోయిన పరిస్థితిలో దిక్కుతెలియక అల్లాడుతున్న టీడీపీని అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్, ఏదో ఒక విధంగా కనీసం ఒకటి రెండు చోట్లయినా.. నాయకులను నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీలు పొత్తుకుసై అంటున్నారు. నాకు నువ్వు-నీకు నేను అన్న విధంగా ఈ రెండు పార్టీలూ పొత్తులకు చొరవ చూపుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఎగిరిన తెలుగు దేశం జెండాను పోయిపోయి అదే పార్టీతో జట్టుకు సిద్ధమవడంపై టీడీపీ నేతలు సమర్ధించుకుంటున్నా.. కేసీఆర్ మాత్రం వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు.
ఆత్మహత్య చేసుకోవడమేనంటూ.....
కాంగ్రెస్‌కు దిక్కులేక ఉనికిలో కూడా లేని టీడీపీతో పొత్తుకు సిద్ధపడడం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. తాను చేయించిన దాదాపు 17 సర్వేల్లో టీడీపీకి కేవలం 0.1% లేదా 0.2% ఓట్లు మాత్రమే వచ్చాయని, అయినా ఆంధ్రాకు చెందిన పార్టీ మళ్లీ తెలంగాణలో ఎలా సిగ్గులేకుండా పోటీ చేస్తుందని, ఈ సన్నాసులు(కాంగ్రెస్ నేతలు) మాత్రం పోయిపోయి ఏపీ పార్టీతో ఎలా కలుస్తారు? ప‌్రజలు ఎలా ఓట్లేస్తారు? అంటూ నిప్పులు చెరిగారు. ఆంధ్రాకు బానిసలు కావొద్దనేది తెలంగాణ సిద్ధాంతమని, మళ్లీ కాంగ్రెస్ నేతలు అలా బానిసలుగా ఉండేందుకే సిద్ధపడుతున్నారని, ఇదే కనుక జరిగితే.. ఇప్పుడు ఉన్నవి కూడా పోవడం ఖాయమని ఘాటుగానే జవాబిచ్చారు.
చంద్రబాబుపై నిప్పులు......
అదేసమయంలో మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలపైనా, తెలంగాణపైనా చంద్రబాబు ఇప్పటికీ కోర్టుల్లో కేసులు వేస్తున్నాడని, కృష్ణా, గోదావరి జలాలపై కేసులు నడుస్తున్నాయని, అలాంటి మనిషి ఇక్కడకొచ్చి ఏం చెబుతాడని ఓట్లు ఎలా అడుగుతాడని ప్రశ్నించారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తును కేసీఆర్‌లైట్ తీసుకోవడమే కాకుండా ఇలాంటి పరిణామమే వస్తే.. కాంగ్రెస్‌ను ఏకేసేందుకు ఇంతకు మించిన ఆయుధం లేదనేవిధంగా ఆయన వ్యవహరించనున్నాడనేది స్పష్టమైంది.