అమెరికా యాత్ర ముగించుకుని స్వదేశం రాగానే చంద్రబాబు పూర్తి ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారు. నిమిషం ఖాళీ లేకుండా ఆయన షెడ్యూల్ రోజు సాగిపోతుంది. విశాఖ జిల్లా లో ప్రజాప్రతినిధుల కాల్చివేత పై అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాలను ఓదార్చిన బాబు ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో ధర్మపోరాట సభలో పాల్గొన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన సభల్లో మూడు ప్రధాన అంశాలు సాగుతున్నాయి. ఒకటి జగన్, పవన్ లపై విరుచుకుపడటం, కేంద్రం అన్యాయం చేసింది మనం ధర్మ పోరాటం చేస్తున్నామని ప్రచారం సాగించడం, మూడు తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పించడం ముఖ్యమైనవి.
పవన్ ది పలాయనం... జగన్ కి మోడీ భయం ...
టిడిపి కి రాబోయే ఎన్నికల్లో అడ్డుగా నిలిచే రెండు ప్రధాన పార్టీలపై గట్టిగా దృష్టి పెట్టారు చంద్రబాబు. జగన్ పార్టీ వైసిపికి మోడీ అంటే భయమని తమిళనాడులో శశికళ గతే తనకు పడుతుందని ఆందోళన ఉందంటూ అన్ని చోట్లా ప్రచారం మొదలెట్టేశారు. పార్లమెంట్లో అవిశ్వాసం పెడితే వైసిపి ఎక్కడుందని నిలదీస్తున్నారు బాబు. అదే రీతిలో పవన్ పైనా విమర్శనాస్త్రాల్లో పదును పెంచారు.
స్ట్రయిట్ టర్న్ అంటూ......
పార్లమెంట్లో అవిశ్వాసం పెడితే మద్దత్తుగా నిలుస్తా అని చెప్పిన పవన్ ఆ తరువాత టిడిపి నోటీస్ ఇస్తే పలాయన వాదం పట్టరాని దెప్పుతున్నారు బాబు. ఇక మోడీ లోక్ సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చలో బాబు ఇగో హర్ట్ చేసేలా మాట్లాడిన తీరు ఆయన మర్చిపోలేక పోతున్నారు. తనను యూ టర్న్ తీసుకున్నానని మోడీ అనడం పై బాగా ఫైర్ అవుతున్నారు. టిడిపి ది యూ టర్న్ కాదని స్ట్రైట్ టర్న్ అని కానీ బిజెపి నే యూ టర్న్ కొట్టిందని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని బిజెపి నే అంటూ పొలిటికల్ హీట్ సృష్టిస్తున్నారు చంద్రబాబు.