భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ముస్లింలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆయన తాజాగా గుంటూరులో ‘నారా హమారా - టీడీపీ హమారా’ పేరుతో మైనారిటీలతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ముస్లిం ప్రజలను సమీకరించారు. చంద్రబాబు నాయుడు సహా వేదిక మీద ఉన్న టీడీపీ నేతలంతా సంప్రదాయ ముస్లిం టోపీలు పెట్టుకుని ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముస్లింలకు తమ ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు పలు హామీలు ఇచ్చారు. ముఖ్యంగా త్వరలోనే క్యాబినెట్ వస్తరణ జరిపి ఒక ముస్లింను క్యాబినెట్ లోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. పనిలో పనిగా గత ఎన్నికల్లో అత్యధికంగా ముస్లిం వర్గానికి చెందిన వారు జగన్ కు మద్దతు ఇచ్చారని గ్రహించిన ఆయన జగన్ మతతత్వ బీజేపీతో జతకట్టారని, జగన్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అని ఆరోపించారు.
సోషల్ మీడియా వేదికగా..!
చంద్రబాబు చేసిన ‘నారా హమారా - టీడీపీ హమారా’ సభ ఎంతవరకు ఫలితమిస్తుందో ఏమో కానీ, చంద్రబాబు వైఖరిపై మరోసారి సోషల్ మీడియాలో విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా పదవీకాలం ముగిస్తున్న వేళ ముస్లింలకు మంత్రవర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పడాన్ని కేవలం ముస్లింలను ఆకట్టుకునే స్టంట్ మాత్రమే అనే విమర్శలు వస్తున్నాయి. ఇక గుజరాత్ అల్లర్ల తర్వాత మోదీకి వ్యతిరేకంగా తానే మాట్లాడాను అని చంద్రబాబు చెప్పుకోవడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన అప్పుడు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన మాట నిజమే అయినా తర్వాత అదే మోదీతో పొత్తు పెట్టుకున్నారు కదా అని సోషల్ మీడియాతో ఆరోపణలు వస్తున్నాయి. ఇక ‘జగన్ కు ఓటేస్తే నరేంద్ర మోదీకి ఓటేసినట్లే’ అని ఆయన చెప్పిన మాట తెల్లారి టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికన వచ్చింది. దీనిని అందిపుచ్చుకున్న వైసీపీ అనుకూల సోషల్ మీడియా పేజీలు గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన ‘జగన్ కు ఓటేస్తే రాహుల్ గాంధీకి వేసినట్లే’, ‘నేను బీజేపీకే ఓటేశాను’ అనే పేపర్ కట్టింగ్ లను ఒకచోట పెట్టి విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాన్ని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టినట్లు కనపడుతోంది.
తానోటి తలిస్తే...
ఇక చంద్రబాబు నాయుడు సభలో కొందరు ముస్లిం యువకులు ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ముస్లింలకు అన్యాయం జరుగుతోందని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ ఏమైంది అంటూ యువకులు చంద్రబాబు ముందే ప్లకార్డులు చూపించి నిరసన వ్యక్తం చేశారు. వీరంతా నంద్యాలకు చెందిన యవకులుగా తేలింది. దీంతో వెంటనే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని మూడురోజులుగా వేదింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీరి సెల్ ఫోన్లు కూడా లాక్కుని వారి కుటుంబసభ్యులకు సైతం వీరి ఆచూకీ తెలియకుండా చేస్తున్నారని, కృష్ణా జిల్లాలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వీరి అరెస్టులకు నిరసనగా బుధవారం రాత్రి కర్నూలు, నంద్యాలలో ముస్లింలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. వాస్తవానికి సభల్లో నిరసనలు వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. అలా జరిగినప్పుడు తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేయడం లేదా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చడం పోలీసుల బాధ్యత. ఇక్కడా అలానే చేస్తే సరిపోయేది, కానీ, ఆచూకీ సైతం తెలియకుండా పోలీసులు ప్రవర్తించడం వివాదాస్పదమవుతోంది. మొత్తానికి ముస్లింలను ఆకట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం వికటించినట్లు కనపడుతోంది.