పార్టీకి హైప్ మరింత రానుందా?
నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరి 27వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు.
నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరి 27వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్ర మాత్రం ఆరోజు మొదలవుతుందని మాత్రం తేదీ ఖరారయింది. మొత్తం నాలుగు వందల రోజుల పాటు చినబాబు జనంలోనే ఉండనున్నారు. ఆయన ప్రజలతో మమేకం అవుతూ దాదాపు నాలుగువేల కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. గతంలో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర కంటే ఇది ఎక్కువగా చెప్పుకోవాలి. ఇందుకు తగిన ఏర్పాట్లను పార్టీ నేతలు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు.
చిత్తూరు జిల్లా నుంచే...?
కుప్పం నియోజవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇచ్ఛాపురంలో ముగియనుంది. అయితే దాదాపు ఏడాది కాలం మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇది చాలా ఎక్కువ సమయం అని పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి నుంచి కొంత కుదురుకుని పార్టీ బలోపేతం అవుతుందనుకుంటున్న సమయంలో లోకేష్ పాదయాత్ర చేపట్టడంతో మంగళగిరిలో మాత్రం పార్టీ నేతలు కొంత డీలా పడ్డారని తెలిసింది.
మంగళగిరిలో...
లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. ప్రధానంగా యువతను ఆకట్టుకోవాల్సి ఉంది. అందుకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. అది పార్టీకి అవసరం కూడా. ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం ఉండదు. మంగళగిరిలో పూర్తి స్థాయిలో కుదుకునేందుకు కూడా లోకేష్ కు టైం ఉండకపోవచ్చు. పూర్తిగా ద్వితీయ శ్రేణి నేతలపైనే ఆయన ఆధారపడక తప్పదు. ఏడాది నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి రావడం కొంత కష్టమేనని పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.
సానుభూతి దొరుకుతుందా?
లోకేష్ పడే కష్టం మంగళగిరిపైన కూడా ప్రభావం చూపుతుందన్న వారు కూడా లేకపోలేదు. పాదయాత్ర వల్లనే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న కారణంతో మరింత సానుభూతి పెరిగే అవకాశం ఉందన్న లెక్కలు లేకపోలేదు. అందుకే ఏడాది పాటు దూరంగా ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండబోదంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన పరిస్థిితి ఉంటుంది. చంద్రబాబు పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. జగన్ కూడా అంతే. కానీ లోకేష్ పాదయాత్ర చేసినా అధికారంలోకి రాలేకపోతే మాత్రం ఆ అపవాదు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అదే అధికారంలోకి వస్తే లోకేష్ కు వంద శాతం క్రెడిట్ లభిస్తుంది. చినబాబు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ యాత్రకు శ్రీకారం చుడుతుండటంతో పార్టీకి చెందిన యువతలో మాత్రం ఉత్సాహం పెల్లుబుకుతుంది. ఓట్లను రాబట్టడంలో లోకేష్ యాత్ర ఏ మేరకు ఉప యోగపడుతుందనేది భవిష్యత్ లో తేలాల్సి ఉంది.