ఉత్తరాంధ్రలో మరో తుఫాన్ ...?

Update: 2018-10-15 05:00 GMT

అవును ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాను మరో తుఫాన్ చుట్టి ముట్టింది. అదేమిటో కాదు తుఫాన్ బాధితుల కన్నీటి ఘోష ఇప్పుడు రోడ్డెక్కింది. ఏ ఊరు చూసినా బాధితులు అధికారులను ఎక్కడికక్కడ చుట్టుముట్టి తమ సాయం పై తుఫాన్ లా విరుచుకుపడుతున్నారు. ఒక్క అధికారులే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రికి సైతం చేదు అనుభవాలే బాధితుల నుంచి చవిచూడాలిసి వస్తుంది. మంత్రి నారా లోకేష్ నుంచి అందరిని కడిగేస్తున్నారు తుఫాన్ బాధితులు. వేలకొలది విద్యుత్ స్థంబాలు నేలకూలడం, మూడు లక్షలకు పైగా కొబ్బరి చెట్లు అరటి, మామిడి, జీడీ మామిడి తోటలు తుఫాన్ దెబ్బకు సమూలంగా నాశనం కావడం, వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదులకు వరదపోటెత్తడం తో ఆహారం, మంచినీరు లేక బాధితులు అల్లాడిపోతున్నారు.

లోకేష్ యుఎస్ టూర్ క్యాన్సిల్ ...

శ్రీకాకుళం లో పరిస్థితి దయనీయంగా ఉండటం, స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు పర్యవేక్షిస్తున్నా జనం ఆందోళనలు కొనసాగుతూ ఉండటంతో మంత్రి లోకేష్ తన మూడు రోజుల అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. టిడిపి కి తొలినుంచి గట్టి కంచుకోట గా వున్న ఉత్తరాంధ్ర లో ప్రజల నుంచి ప్రభుత్వ సాయంపై పెల్లుబికుతున్న అసంతృప్తి చల్లార్చడానికి చంద్రబాబు కు తోడుగా లోకేష్ రంగంలోకి దిగి పరిస్థితి ని సమీక్షిస్తున్నారు.

నిరసనల సెగ తగలడంతో.....

ఇప్పటికే లోకేష్ కు సైతం బాధితుల నిరసనల జ్వాలలు గట్టిగానే తాకాయి. దాంతో యంత్రాంగాన్ని దగ్గరుండి పర్యవేక్షించక పోతే బాధితులు విధ్వంసాలకు సైతం దిగే పరిస్థితిని సర్కార్ అంచనా వేసి సహాయ పునరావాస చర్యలు ముమ్మరం చేసింది. కొద్ది రోజుల్లో జగన్ శ్రీకాకుళం జిల్లాకు పాదయాత్రగా రానుండటం పవన్ సైతం ఉత్తరాంధ్ర బాధితుల పరామర్శ చేస్తానని ప్రకటించడం కూడా అధికార పార్టీ సహాయ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా ఉండక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టింది.

Similar News