వార్త ప్రచురించడమే కానీ దాని పై ప్రజల అభిప్రాయాలన్నవి తెలుసుకోవడం ఉండేవి కావు. ప్రింట్ మీడియా లో ఈ పరిస్థితి దశాబ్దాలుగా సాగుతూ వస్తున్న తంతు. అయితే సాంకేతిక విప్లవం తెచ్చిన మార్పుతో సోషల్ మీడియా సీన్ లోకి వచ్చాక రాజ్యాంగవిరుద్ధంగా కానీ, చట్టవిరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా నీతి తప్పుతున్నా ఇప్పుడు ప్రజలు సోషల్ మీడియా లో కాలర్ పట్టుకుని మరీ నిలదీస్తున్నారు. నెట్ లో పూర్తిగా సదరు వ్యక్తులను బట్టలు విప్పి నిలబెట్టేస్తున్నారు నెటిజెన్స్. అయినా కానీ వ్యవస్థలను గాడిన పెట్టాలిసిన వారే వాటిని పక్కదారి పట్టిస్తూ ప్రజాభిప్రాయాలను గాలికి వదిలి మేము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని సమాధాన పర్చేసుకుంటున్నారు నాయకులు.
జీవో తో నెటిజెన్స్ కి దొరికిన బాబు ...
సిబిఐ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టకుండా ప్రత్యేక జీవో తెచ్చిన ఎపి సిఎం చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికల పై సెటైర్స్ ఒక రేంజ్ లో నడుస్తున్నాయి. వాటిలో కొన్ని అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. వ్యంగ్యంగా నెటిజెన్స్ చేసే కొన్ని కామెంట్స్ వైరల్ గా కూడా మారాయి. వాటిలో కొన్ని చూద్దాం . విపక్షాలను ఏపీలో లేకుండా జీవో తెచ్చి వాటిని సమాధి చేయాలని కొందరు సూచించారు. చంద్రబాబు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండేలా ఆయన తదనంతరం లోకేష్ ఆ తరువాత దేవాన్ష్ లు ముఖ్యమంత్రులుగా కొనసాగేలా జీవో తేవాలని మరికొందరు వెటకారం చేస్తున్నారు.
అవినీతిని చట్టబద్ధం చేయాలంటూ.....
ఏపిలో అవినీతిని చట్టబద్దం చేయాలని మరికొందరు చంద్రబాబు కు సూచించారు. తెలుగుదేశం ఎమ్యెల్యేలు, ఎంపీలు న్యాయస్థానాలు గా వారి నియోజకవర్గాల్లో వ్యవహరించేలా జీఓ తేవాలని మరికొందరు పేర్కొన్నారు. ప్రత్యేక దేశంగా ఆంధ్రప్రదేశ్ ను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చేయాలని ఇంకొందరు చంద్రబాబుకు సూచించారు. ఇలా సిబిఐ ను అడ్డుకుంటూ అధికార పార్టీ ఇచ్చిన జీవో రచ్చ రంబోలా గా సోషల్ మీడియా లో మారడం విశేషం.