మొదలైంది వరద రాజకీయం ...!

Update: 2018-08-19 03:30 GMT

ముందస్తుగా ఎన్నికల ఫీవర్ దేశాన్ని పట్టికుదిపేస్తుంది. ప్రతి అంశం రాజకీయంగా మారిపోతుంది. తాజాగా కేరళ లో జల విలయం సైతం రాజకీయ క్రీడకు వేదికగా మారిపోయింది. కేరళకు కేంద్రం ప్రకటించిన సాయం పై విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కస్సుమని లేచింది. ఐదువందల కోట్ల రూపాయలు ప్రకటించి ప్రధాని చేతులు దులుపుకుంటారా ? తక్షణం జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తి స్థాయిలో ఆదుకోవాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోడీపై విరుచుకుపడ్డారు. మీనమేషాలు లెక్కించకుండా తక్షణం ఆ పని చేయాలంటూ రాహుల్ డిమాండ్ చేశారు.

ప్రధాని సాయంపై కేరళ అసంతృప్తి ...

ప్రధాని నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలోని జలప్రళయాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. ఆ తరువాత కేరళ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దాదాపు 19వేలకోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు కేరళ సీఎం విజయన్ ప్రాధమిక అంచనా నివేదికను ప్రధానికి అందించారు. అవన్నీ చూసిన ప్రధాని అంతకు ముందు ఇచ్చిన వందకోట్ల రూపాయలకు అదనంగా మరో 500 కోట్ల రూపాయలు ప్రకటించారు. అయితే కనీసం తక్షణ సాయంగా రెండువేలకోట్ల రూపాయలైనా కేంద్రం సాయం చేయాలని కేరళ అభ్యర్ధించింది. కానీ ప్రధాని అందులో నాలుగోవంతు సాయం మాత్రమే ప్రకటించడంతో కేరళ సర్కార్ అసంతృప్తి తో ఉంది. వర్షాలు వరదల్లో చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి ఇరవై వేలరూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. మరో పక్క కేరళపై వరుణ దేవుడు ఇంకా జాలి చూపలేదు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు కేరళ వాసులను గజగజ వణికిస్తోంది.

రంగంలోకి ఆర్మీ ...

కేరళ లో దారుణ పరిస్థితులపై ఆర్మీ రంగంలోకి భారీగా దిగింది. ఇప్పటికే వాయుసేన తనదైన సేవలు అందిస్తుంది. బాధితులను రక్షించడం, ఆహారం మంచినీరు అందించే పనుల్లో ముందుకు సాగుతుంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు బాధితులకు సాయం అందించడంలో ఆర్మీకి అడ్డుగా నిలుస్తున్నాయి. జాతీయ విపత్తు నివారణ బృందాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సాహాయక బృందాలు విస్తృత సేవలను ప్రాణాలకు తెగించి మరి అందిస్తున్నాయి. మరోపక్క జాతీయ, రాష్ట్ర రహదారులు దారుణంగా దెబ్బతినడం కొట్టుకుపోవడంతో సహాయక బృందాలు కొన్ని ప్రాంతాల్లో నిస్సహాయ స్థితిలో ఉండిపోవాలిసి వస్తుంది.

సాయం కోసం.....

దాంతో ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ నిపుణుల బృందం నేతృత్వంలో రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలు పెట్టారు. మరోపక్క రాష్ట్రంలోని నదులు, వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ కొండచరియలు విరిగి పడతాయో తెలియక ఆయా ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కేరళ కు చేయూత అందించేందుకు వదాన్యులు ముందుకు వస్తున్నారు. సెలబ్రిటీలు వివిధ రాష్ట్రాలు ఇప్పటికే సాయం అందించడానికి ముందుకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలు సైతం వరద బాధితులకు అండగా ఉండటానికి అన్ని విధాలా చేయూత అందిస్తున్నాయి.

Similar News