నాడు చక్రం తిప్పి... నేడు ఒంటరైపోయి..!

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి హోదా... దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయి... ఓ ప్రాంతీయ పార్టీకి ఇరవై ఎనిమిదేళ్లుగా అధ్యక్షుడి పనిచేసిన అనుభవం.. తన ఎంపీలను లోక్‌సభ స్పీకర్‌, కేంద్ర మంత్రుల స్థాయికి తీసుకెళ్లిన పవర్‌... ఇదీ నారా చంద్రబాబునాయడు అంటే. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసినా జాతీయ స్థాయిలో పెద్దగా స్పందన లేదు.

Update: 2023-09-10 09:24 GMT

చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించని ప్రతిపక్షాలు

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి హోదా... దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల స్థాయి... ఓ ప్రాంతీయ పార్టీకి ఇరవై ఎనిమిదేళ్లుగా అధ్యక్షుడి పనిచేసిన అనుభవం.. తన ఎంపీలను లోక్‌సభ స్పీకర్‌, కేంద్ర మంత్రుల స్థాయికి తీసుకెళ్లిన పవర్‌... ఇదీ నారా చంద్రబాబునాయడు అంటే. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసినా జాతీయ స్థాయిలో పెద్దగా స్పందన లేదు. ఆయన నిర్బంధాన్ని ఖండిరచే వేరే ప్రాంతీయ పార్టీ గానీ, ఇతర రాష్ట్రాల నాయకులు కానీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. వాజ్‌పేయి లాంటి ప్రధాన మంత్రికి అత్యంత సన్నిహితంగా మెలిగి, విజన్‌ ఉన్న నాయకుడని, ఐటీ రంగానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని అఖిల భారత స్థాయిలో పేరు తెచ్చుకున్న చంద్రబాబుకు ఈ దుస్థితి ఎందుకు పట్టింది..?

చంద్రబాబు కంటే ముందు ఎన్టీయార్‌ జాతీయ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్‌ హవా నడిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సైకిల్‌ ఉరకలు, పరుగులు పెట్టింది. రాష్ట్రంలో 40 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి, ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఓ ప్రాంతీయ పార్టీ సాధించిన అరుదైన ఘనత ఇది. 1995లో ఎన్టీయార్‌ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక స్థానాన్నే ఆక్రమించారు. యువనేతగా, టెక్నాలజీకి పెద్ద పీట వేసే ఆధునిక భావజాలం ఉన్న నాయకుడిగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. 1998లో వాజ్‌పేయీ నేతృత్వంలో ఎన్డీయే కూటమిలో చేరారు. 1999 ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో భాజపాతో కలిసి నడిచారు. దీనివల్ల రెండు పార్టీలూ లబ్ధిపొందాయి. ఎన్నికల్లో విజయం సాధించి... అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాయి.

2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి తెదేపా, భాజపా కూడా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత పదేళ్ల పాటు రెండు పార్టీలూ ప్రతిపక్షంలోనే ఉన్నాయి. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ ఏపీలో, అవినీతి ఆరోపణలతో కేంద్రంలో దెబ్బతింది. భాజపా హవాను ముందే పసిగట్టిన బాబు మళ్లీ కమలం పార్టీతో కలిశారు. తెలుగుదేశం పొత్తుకు మొదట్లో మోదీ ఆసక్తి చూపించలేదనే వార్తలు వచ్చాయి. గోద్రా అల్లర్ల సందర్భంగా చంద్రబాబు మోదీని తీవ్రంగా విమర్శించారు. వెంకయ్యనాయుడి దౌత్యం ఫలించి చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరారు. పవన్‌ కళ్యాన్‌ కూడా ఈ టీమ్‌కి చేరడంతో చంద్రబాబు మెజార్టీ సాధించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని సాధించారు. తొలి నాలుగేళ్లు మోదీ టీంతో సఖ్యంగా ఉన్న సైకిల్‌ పార్టీ అధినేత ఎన్నికలకు ఏడాది ముందు వేరు కుంపటి పెట్టారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే భ్రమతో గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆ పార్టీతో జత కలిశారు. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ ఏర్పాటు చేసే ప్రభుత్వంలో కూడా తాను చక్రం తిప్పొచ్చు అనుకున్నారు. కానీ ఆయన అనుకున్నది ఒకటి.. అయినది ఇంకొకటి. మళ్లీ భాజపా అధికారంలోకి రావడంతో... వెంటనే బాబు తన ‘చాణక్యం’ అంతా ఉపయోగించి.. కాంగ్రెస్‌ కూటమిని నట్టేట్లో వదిలేశారు. భాజపా రాగం అందుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలకు బాబు మీద నమ్మకం పోయింది. మోదీ, అమిత్‌షా ద్వయం కూడా చంద్రబాబును నమ్మడం లేదు. అయినా తాను ఇప్పటికీ ఎన్డీయే భాగస్వామిననే చంద్రబాబు నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌ను జాతీయ స్థాయిలో కానీ, ప్రాంతీయ స్థాయిలో కానీ ఏ పార్టీ కూడా సీరియస్‌గా తీసుకోలేదు. ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి మాత్రం వైకాపా ప్రభుత్వ చర్యను ఖండిరచారు. గత ఎన్నికల్లో బాబుతో రాసుకు పూసుకు తిరిగిన మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, కుమారస్వామి లాంటి నేతలు కనీసం ఆయన అరెస్ట్‌ను ఖండిరచలేదు. జాతీయ స్థాయి మీడియా కూడా బాబు అరెస్ట్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణ నుంచి కూడా ఎలాంటి సౌండ్‌ వినిపించడం లేదు. అక్కడి భాజపా నాయకుడు రఘనందన్‌ రావు మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడటం గమనార్హం. ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్‌ చేశారంటే, ప్రభుత్వం వద్ద బలమైన ఆధారాలున్నట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన నేత అరెస్ట్‌ జాతీయ స్థాయిలో ఎవరినీ కదిలించలేకపోవడం రాజకీయ వైచిత్రి.

Tags:    

Similar News