తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత నాయని నరసింహారెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పక్కనపెట్టారా? ఆయనకు ఈ కేబినెట్ లో చోటుదక్కడం కష్టమేనా...? అంటే అవుననే అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గత కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేసిన మహమూద్ ఆలీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు హోంమంత్రిత్వ శాఖను కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హోమంత్రిగా మహమూద్ ఆలి నియామకాన్ని నోటిఫై చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు
మహమూద్ ఆలీకి హోంమంత్రి పదవి......
ఈ నేపథ్యంలో నాయనిని పక్కన పెట్టినట్లేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సారి ఎమ్మెల్యేలుగా ఉన్న వారికే మంత్రివర్గంలో ఎక్కువ మందిని తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాయని ముషీరాబాద్ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తన అల్లుడికి టిక్కెట్ ఇవ్వాలని చివరి నిమిషం వరకూ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో నాయనిని వచ్చే ఎన్నికల్లో కేబినెట్ లోకి తీసుకుంటారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి పదవికి మహమూద్ ఆలిని ఎంపిక చేయడంతో నాయనికి ఇక ఛాన్స్ లేనట్లేనన్నది ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.