జగనన్నకు ఒక అన్న దొరికాడుగా?

జగన్ కు ఒక స్నేహితుడు దొరికాడు. ఒక అన్న లభించినట్లయింది. తెలంగాణ రూపంలో ఆసరా లభించింది.

Update: 2022-06-01 07:01 GMT

జగన్ కు ఒక స్నేహితుడు దొరికాడు. ఒక అన్న లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని, మరో శ్రీలంకలా మారనుందని గత కొంతకాలంగా విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ ఏడు లక్షల కోట్ల అప్పు చేశారని, అభివృద్ధి లేదని, అప్పులు మాత్రం మిగిలాయని, రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఖద్దరు ధరించిన చిన్నా చితకా నేతలు సయితం విశ్లేషణలకు దిగుతున్నారు. జగన్ మాత్రం అప్పో, సొప్పో చేసి రాష్ట్రాన్ని లాక్కొస్తున్నారు. ఇక ఒక వర్గం మీడియా కూడా జీతాలు ఒకటో తేదీన అందలేదని, పింఛన్ల పంపిణీ జరగలేదన్న విమర్శలు ఏపీ ఎడిషన్ లలో సర్వసాధారణమయి పోయాయి.

తెలంగాణలో....
కానీ ఇప్పుడు జగన్ సరసన మన పొరుగున ఉన్న కేసీఆర్ సయితం చేరారు. అన్ని రకాలుగా బలంగా ఉన్న తెలంగాణ సయితం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు, పింఛన్లకు కూడా ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఒక్క రైతు బంధు పథకాన్ని అమలు చేయాలంటే 7 వేల కోట్లు అవసరమవుతాయి. తక్షణ అవసరాలు తీరాలంటే 20 వేల కోట్ల రూపాయలు నిధులు తెలంగాణ ప్రభుత్వానికి అవసరమవుతాయి.
కేంద్ర ప్రభుత్వం....
కానీ తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేయడానికి వీలుకాకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఎఫ్ఆర్ఎంబీ కి మించి అప్పులు చేసిన విషయాన్ని గుర్తు చేస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతి లభిస్తేనే తెలంగాణలో సంక్షేమ పథకాలు గట్టున పడతాయని అంటున్నారు. లెక్కకు మించి అప్పలు చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఊరటే కదా?
తెలంగాణ అప్పుల పరిస్థితి జగన్ కు కొంత ఊరట కల్గించే విషయమే. ఆదాయం అధికంగా ఉన్న తెలంగాణ అప్పులు చేస్తుంటే ఏపీ చేస్తే తప్పేంటని అధికార పార్టీ నేతలు ఎదురు ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. సంక్షేమ పథకాల కోసం రెండు రాష్ట్రాల ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని, ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకూ అప్పల విషయంలో జగన్ ఒంటరిగా ఉన్నారు. కానీ కేసీఆర్ జత కావడంతో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుండటాన్ని వైసీపీ నేతలు తమ అధినేత ముందుచూపు అని మెచ్చుకుంటున్నారు. ఇకపై ఏపీలో విపక్షలు రెండు తెలుగు రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News